బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారనైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. హేమ విషయంలో పోలీసులు బయటపెట్టిన ఆధారాల ప్రకారం యాక్షన్ ఉంటుందంటూ గతంలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హేమ అంశంపై చర్చించిన ‘మా’ కమిటీ.. నటి హేమ మా సభ్యత్వం సస్పెండ్ చేయడానికి అభిప్రాయాలను కోరారు.
దీనిపై మా అసోసియేషన్ గ్రూప్‌లో మంచు విష్ణు మెసేజ్ చేశారు. ఈ మేరకు హేమ సభ్యత్వం రద్దుపై అభిప్రాయాలను సేకరించిన మంచు విష్ణు.. అధిక మంది హేమను సస్పెండ్ చేయడంపై పాజిటివ్‌గా స్పందించినట్లు తెలిపారు. దీంతో ఆమెకు క్లీన్ చీట్ వచ్చేంత వరకు మా అసోసియేషన్‌లో హేమ సభ్యత్వం రద్దు చేయాలని మంచు విష్ణు కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిపై గురువారం మా అధ్యక్షుడు విష్ణు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
కాగా బెంగళూరు నగర శివార్లలో రేవ్‌పార్టీలో పాల్గొన్న దాదాపు 150 మందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో భారీ మొత్తంలో డ్రగ్స్ వినియోగించినట్లు తేలింది. ఈ పార్టీకి మాదకద్రవ్యాలు సమకూర్చారనే ఆరోపణపై ఇప్పటికే సిద్ధిక్, రణధీర్, రాజ్‌భావ అనే వ్యక్తులను కటకటాల వెనక్కినెట్టారు. ఇదే పార్టీకి హాజరైన నటి హేమ తొలుత తాను ఇంట్లోనే ఉన్నానని, రేవ్‌పార్టీలో లేనని పలు వీడియోలు విడుదల చేసింది. ఆ తర్వాత చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల దృష్ట్యా నటి హేమ సీసీబీ దర్యాప్తు అధికారుల ఎదుట లొంగిపోయింది. బుర్కా ధరించి చామరాజపేటలోని సీసీబీ కార్యాలయంలోకి చేరుకున్న హేమ.. అధికారులు అడిగిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వకపోవడంతో చివరికి అరెస్టు చేశారు.
మరిన్ని సినిమా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.