హాలీవుడ్ మూవీ ది లయన్ కింగ్ చిత్రానికి ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. 2019లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో చెప్పక్కర్లేదు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ తీసుకువస్తున్నారు మేకర్స్. ముఫాసా: ది లయన్ కింగ్ పేరుతో ఈ సినిమా రెడీ అయ్యింది. ఈ ఏడాది డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో ఆరోన్ స్టోన్, కెల్విన్ హ్యారిసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా డిస్నీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ఇందులో ముఫాసా పాత్ర తెలుగు వెర్షన్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్ చెప్పనున్నట్లు తెలిపింది. ఇక ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను ఈనెల 26న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సినిమాలో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పడంపై మహేష్ మాట్లాడుతూ.. “డిస్నీ అంటే నాకెంతో గౌరవం ఉంది. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ మెప్పిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీనిని నా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తాను. డిసెంబర్ 20న తెలుగులో ముఫాసా: ది లయన్ కింగ్ సినిమాను బిగ్ స్క్రీన్ పై నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అంటూ ఆనందం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల విడుదలైన ముఫాసా హిందీ ట్రైలర్ ఆకట్టుకుంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్ చిన్న కుమారుడు అబ్రం వాయిస్ అందించారు. అలాగే ముఫాసా పెద్దయ్యాక పాత్రకు షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. ఇక ఇందులో సింబా పాత్రకు షారుఖ్ పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ వాయిస్ అందించారు. బాద్ షా కుటుుంబం మొత్తం కలిసి ఓ సినిమా కోసం వర్క్ చేశారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.