Maa Crisis: మా వెనుక మేముంటాం. మాలో సంక్షేమం జరగాలి. మంచు విష్ణును ప్రతినెలా ప్రోగ్రస్ కార్డు అడుగుతా. ప్రశ్నిస్తూనే ఉంటాను. అందరూ ఉదయం నుంచి ఆత్మా.. ప్రేతాత్మా.. అంతరాత్మ అని అంటున్నారు. అటువంటివి ఏమీ లేవు. మేము మా లోనే కొనసాగుతున్నాం. అంటూ విస్పష్టంగా ప్రకటించారు ప్రకాష్ రాజ్. మా ఎన్నికల హంగామా తరువాత జరిగిన పరిణామాల్లో ప్రకాష్ రాజ్ టీం మొత్తం తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడానికి ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ తమ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. రాజీనామాలతో తమ నిరసనను వ్యక్తం చేస్తూనే.. మా విషయంలో భవిష్యత్తులో ఏమి జరగబోతోందో చూచాయగా చెప్పెశారాయన.
రెండు ప్యానల్స్ గా పోటీ చేయడం.. పోటీ మరీ విపరీత పోకడలు తీసుకోవడం.. రెండు పానెల్స్ నుంచి సభ్యులు ఎన్నిక కావడం ఇబ్బందికర విషయం అని చెబుతూ మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన మొత్తం అందరూ (11 మంది సభ్యులు) తమ పదవులకు రాజీనామా చేశారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బావుండాలి. మేము అక్కడ ఉంటె.. మంచు విష్ణు మేనిఫెస్టో నూరుశాతం అమలు చేయాలంటే వారి ప్యానెల్ పూర్తిగా అధికారంలో ఉండడం అవసరం. అందుకోసమే, మేము రాజీనామా చేశాము అని చెప్పారు. తరువాత మాట్లాడిన బెనర్జీ మాట్లాడుతూ ఎమోషన్ అయ్యారు. తాను మూడు రోజుల నుంచి నిద్ర పోలేదు అని అన్నారు. మోహన్ బాబు నన్ను కొట్టడానికి వచ్చారు. విష్ణు వెనక్కి లాగారు. ఆమ్మల పేరు మీద బూతులు తిట్టారు. నేను మోహన్ బాబు ఇంటిలో మనిషిని. అయినా నన్ను తిట్టారు. ఇది నన్ను చాలా బాధ పెట్టింది. అక్కడ ఉన్న ఎవరూ ఆయనను ఆపడానికి ప్రయత్నించలేదు. నలభై ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న నేను ఇన్ని బూతులు తిట్టించుకుని.. ఇంత అవమానంతో ఎందుకు మాలో కొనసాగాలి? అందుకే రాజీనామా చేస్తున్నాను అని చెప్పారు. విష్ణు బాగా చేస్తాడని నమ్మకం ఉంది. బాగా చేసి మంచి పేరు తెచ్చుకోండి అని అంటూ ముగించారు.
నటుడు ఉత్తేజ్ మాట్లాడుతూ నాన్ లోకల్ అనే పదానికి తీవ్ర అభ్యంతరం చెప్పారు. ”సినిమా అన్న పదమే లోకల్ కాదు. అటువంటిది మా లో లోకల్ నాన్ లోకల్ అనే తేడా తీసుకువచ్చారు. ప్రకాష్ రాజ్ కి మా అనేది ఎలా ఉండాలో తెలుసు. ఎక్కడి నుంచో వచ్చి మా లో అందరూ బావుండాలని నిలబడ్డారు ప్రకాష్ రాజ్. నరేష్ ప్రవర్తన సరిలేదు. ఎన్నికల రోజు నరేష్ అమ్మల పై బూతులు తిట్టారు. మా ఆఫీసులోకి ప్రవేశించాలంటే సభ్యులు థంబ్ ఇంప్రెషన్ వేయాల్సిన పరిస్థితి. చిరంజీవిని లెక్కలు తప్పున్నాయని చెప్పిన నరేష్ అన్నారు. ఇలా ఎన్నో జరిగాయి. పోలింగ్ రోజు బరికేడ్స్ పెట్టారు. యుద్ధ వాతావరణం ఎన్నికల రోజు సృష్టించారు. ” అంటూ ఉత్తేజ్ చెప్పుకొచ్చారు.
ఇక ఓట్లు వేసి గెలిపించిన వారికి థ్యాంక్స్ చెప్పిన తనీష్.. తాజాగా రాజీనామా చేయడంతో వారందరికీ సారీ చెప్పారు. తన వెనుక నిలబడినవారందర్నీ తనీష్ గుర్తు చేసుకున్నారు. ప్రకాశ్ రాజ్ ఐడియాలజీ నచ్చి.. అతని ప్యానల్ నుంచి కంటెస్ట్ చేసినట్టు తనీష్ తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ రోజున మోహన్ బాబు బూతులు తిట్టి కొట్టడానికి వచ్చారని.. తనను సేవ్ చేసేందుకు వచ్చిన బెనర్జీని కూడా దారుణంగా తిట్టినట్లు తెలిపారు. తనకు బాదేసిందని.. ఏడ్చానని.. తర్వాత మంచు విష్ణు, మనోజ్ వచ్చి సముదాయించారని తనీష్ చెప్పాడు. తన వల్లే ఇదంతా జరిగిందని బెనర్జీకి సారీ చెప్పాడు తనీష్. తనకు అమ్మే సర్వస్వం అని.. ఆయన మాటలు మర్చిపోదామనుకున్నా అమ్మను అంటే తీసుకోలేం కదా అని తనీష్ అన్నారు. దెబ్బ మానిపోయినా.. ఆ గాయం గుర్తు అలాగే ఉంటుందని అన్నారు. ఈసీ మెంబర్‌గా భయపడి కంటిన్యూ అవ్వడం కంటే.. రిజైన్ చేయడమే కరెక్ట్ అనిపించింది అన్నారు. సోదరుడిగా మంచు విష్ణుని గౌరవిస్తానని తెలిపారు.
ఇక మీడియా సమావేశాన్ని ముగిస్తూ ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. ఎన్నికలు చాలా గందరగోళంగా జరిగాయి. మా సంక్షేమం ఆగిపోతుందా? మేము ప్రశ్నిస్తే సంక్షేమం ఆగిపోయే పరిస్థితి వస్తుందా? ఇటువంటి ప్రశ్నల మధ్యలో మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మంచు విష్ణు ఇచ్చిన అనేక సంక్షేమ హామీలు ఆయన పూర్తిగా నెరవేర్చడం కోసం స్వేచ్చ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అందరూ రాజీనామా చేస్తున్నారు. ఇది ఒక డిగ్నిఫైడ్ డెసిషన్. మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మా నుంచి విడిపోయి మేము వేరు కుంపటి పెడుతున్నాం అనేది వాస్తవం కాదు అని ఆయన స్పష్టం చేశారు.
Also Read: సంచలనం… నిట్టనిలువునా చీలిన ‘మా’.. ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామా
సుడిగాలి సుధీర్‌కు, సంపూకు భారీగా ఓట్లు.. రికార్డ్ రేంజ్ విక్టరీ