Sirivennela Seetharama Sastry: ‘మీరు కన్ను మూస్తే.. మాకు ఈ ప్రపంచం చీకటయ్యింది…’

సాహితీ సిరి దూరమైంది. వెన్నెల మటుమాయమైంది. సినీ జగత్తును ఓలలాడించిన లాలి పాట శాశ్వతంగా మూగబోయింది. సిరివెన్నెల శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

Sirivennela Seetharama Sastry: 'మీరు కన్ను మూస్తే.. మాకు ఈ ప్రపంచం చీకటయ్యింది...'
lyricist Sirivennela Seetharama Sastry
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 01, 2021 | 8:08 AM

సాహితీ సిరి దూరమైంది. వెన్నెల మటుమాయమైంది. సినీ జగత్తును ఓలలాడించిన లాలి పాట శాశ్వతంగా మూగబోయింది. పాటైనా.. మాటైనా ప్రశ్నించడంలోనే తనను వెతుక్కుంటూ సమాజాన్ని జాగృతం చేస్తూ వచ్చిన ఓ సినీదిగ్గజం రాలిపోయింది. తిరిగిరాని లోకాలకు పోయింది. పాటై ప్రశ్నించిన గొంతు శాశ్వతంగా మూగబోయింది. తెల్లారింది లేవండోయ్‌ అంటూ మనల్ని నిద్రలేపుతూ ఆయన శాశ్వత నిద్రలోకి పోయారు. జగమంత తన కుటుంబాన్ని వదిలి.. సినీ అభిమానుల్ని ఏకాకులను చేసి ఆయన మాత్రం లోకాన్ని వీడారు.

సీతారామశాస్త్రి.. 1955 మే 20న మధ్యప్రదేశ్‌లోని శివినిలో జననం -అనకాపల్లిలో హైస్కూల్లో విద్యాభ్యాసం -కాకినాడ ఆదర్శ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ -ఆంధ్ర వైద్యకళాశాలలో ఒక ఏడాది ఎంబీబీఎస్‌ -ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎమ్‌.ఎ -భరణి కలం పేరుతో పత్రికల్లో కథలు, కవితలు – సోదరుడి ప్రోత్సాహంతో రచనా వ్యాసంగంపై దృష్టి -ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్‌ ‘సిరివెన్నెల’ సినిమాకు పాటలు రాసే అవకాశం – బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘జననీ జన్మభూమి’ సినిమాతో సీతారామశాస్త్రి సినీ ప్రయాణం మొదలైనా, ‘సిరివెన్నెల’ పాటలతోనే ఆయనకు గుర్తింపు – ఆ సినిమాలోని ‘విధాత తలపున..’ పాటకు తొలి నంది పురస్కారం. – కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన అన్ని సినిమాలకూ పాటలు రాసిన శాస్త్రి. – ‘నారప్ప’, ‘కొండపొలం’, ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమాలకూ ఆయన పాటలు రాశారు. – సీతారామశాస్త్రికి పదకొండు నంది పురస్కారాలు – ఆయనకు భార్య పద్మావతి, కుమార్తె లలితాదేవి, కుమారులు సాయి వెంకట యోగేశ్వరశర్మ, రాజా భవానీ శంకరశర్మ ఉన్నారు. – ‘సిరివెన్నెల’లోని ‘విధాత తలపున’., ‘శ్రుతిలయలు’లోని ‘తెలవారదేమో స్వామి’, ‘స్వర్ణకమలం’లోని ‘అందెల రవమిది పదములదా’.., ‘గాయం’లోని ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని’.., ‘శుభలగ్నం’లోని ‘చిలకా ఏ తోడు లేకా’.., ‘శ్రీకారం’ సినిమాలోని ‘మనసు కాస్త కలత పడితే’.., ‘సిందూరం’లోని ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే’.., ‘ప్రేమకథ’లోని ‘దేవుడు కనిపిస్తాడని’.., ‘చక్రం’ సినిమాలోని ‘జగమంత కుటుంబం నాది’.., ‘గమ్యం’లోని ‘ఎంత వరకు ఎందు కొరకు’.., ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లోని ‘మరీ అంతగా..’ పాటలకుగానూ సిరివెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది పురస్కారాలు దక్కాయి.

– సిరివెన్నెల ఇక లేరని తెలియగానే చిత్రసీమ మూగబోయింది. ఆయనతో అనుబంధం ఉన్న పలువురు నటులు, దర్శకులు, నిర్మాతలు, తోటి రచయితలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్‌ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు. సీతారామశాస్త్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Also Read: సాహిత్య లోకానికి చీకటి రోజు.. తీవ్ర భావోద్వేగానికి గురైన చిరంజీవి..