ప్రముఖ దర్శకుడు, నటుడు, కమెడియన్ మనోబాల మే 3న కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మనోబాల మరణం అందరినీ కలిచివేసింది. స్టార్ హీరోలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఆయన మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోలీవుడ్‌కు చెందిన వారైనా మనోబాలకు తెలుగు సినిమా ఇండస్ట్రీతోనూ మంచి అనుబంధం ఉంది. తెలుగులో పున్నమి నాగు, మహానటి, దేవదాసు, వాల్తేరు వీరయ్య సినిమాలతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. తెలుగులో మనోబాల చివరిగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యలో నటించారు. సంక్రాంతికి విడుదలైన ఈ మూవీలో ఆయన జడ్జిగా కనిపించారు. ఇదిలా ఉంటే మనోబాల చివరి రోజుల్లో ఎలా ఉన్నారో తెలియజేస్తూ ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను రిలీజ్ చేశారు మనోబాల కుటుంబ సభ్యులు.
ఈ వీడియోలో మనోబాలకు కనీసం కదలడానికి కాళ్లు, చేతులు సహకరించడం లేదు. నోరు పెగల్చడానికి కూడా ఎంతో ఇబ్బందిపడ్డారు. ఆయనతో మాట్లాడించేందుకు ఎంత ప్రయత్నించినా మనోబాల మాట పెదవి దాటి బయటకు రాలేదు. మనోబాల తన కొడుకు హరీశ్ పాడిన పాట చివరిసారిగా విని ఆనందపడ్డారు. మనోబాల కదల్లేని స్థితిలో వీల్‌చైర్‌కే పరిమితం కావడంతో ఆయన అసిస్టెంట్ ఆయనకు తినిపిస్తూ నీళ్లు తాగించాడు. సినిమాల్లో ఎంతో చురుగ్గా కనిపించే మనోబాల ఆఖరి రోజుల్లో ఎంతో వేధన అనుభవించారని ఈ వీడియోను చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా మనోబాలాకు ‘మనోబాలాస్ వేస్ట్ పేపర్’ పేరిట ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో సినితా తారల ఇంటర్వ్యూలను, సరదా సంఘటలను, రివ్యూలను షేర్ చేసుకునేవారాయన.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..