కోలీవుడ్‌లో మారుతున్న సీన్.. టాలీవుడ్ హీరోలు పాగా వేస్తారా..?
దక్షిణాది సినీ రంగంలో శరవేగంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కోలీవుడ్‌ను దశాబ్ధాలుగా ఏలిన అగ్ర హీరోలు తమ స్థానాలను ఖాళీ చేస్తున్నారు. విజయ్ ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పి ప్రజా జీవితానికి అంకితం కాబోతున్నారు. వయస్సు రీత్యా రజనీకాంత్ సినిమాల వేగం తగ్గించేశారు. కమల్ హాసన్ కూడా ఇటు సినిమాలు అటు పాలిటిక్స్‌తో రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఫలితంగా టాలీవుడ్ స్టార్‌లకు తమిళ మార్కెట్‌లో కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి.

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం బీభత్సమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాట గత కొన్ని దశాబ్దాలుగా ఏలిన అగ్ర హీరోల స్థానాలు ఇప్పుడు ఖాళీ అవుతున్నాయి. దళపతి విజయ్ తన రాజకీయ ప్రస్థానం కోసం సినిమాలకు స్వస్తి పలకడం ఒక పెద్ద మలుపు. రజనీకాంత్ వయస్సు రీత్యా సినిమాల వేగం తగ్గించేశారు. కమల్‌హాసన్ సినిమా – పాలిటిక్స్ అంటూ రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. అజిత్ కుమార్ తన వ్యక్తిగత అభిరుచులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రేసులో ఉన్న సూర్య, ధనుష్, విక్రమ్ వంటి వారు సరైన సక్సెస్ లేక ఫామ్‌లోకి రావడం కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిణామాలు టాలీవుడ్ స్టార్ హీరోలకు నయా మార్కెట్‌ను ఓపెన్ చేస్తున్నాయి.
కోలీవుడ్ అంటేనే మాస్!
తమిళనాడులో ఒక హీరోకి ‘నెంబర్ వన్’ స్థానం దక్కాలంటే కేవలం కలెక్షన్లు ఉంటే సరిపోదు. అక్కడ బలమైన మాస్ ఫాలోయింగ్ ఉండాలి. విజయ్ తర్వాత ఆ స్థాయిలో మాస్ పల్స్ పట్టుకోగలిగిన హీరో అక్కడ ప్రస్తుతం లేరు. సరిగ్గా ఇదే సమయంలో మన తెలుగు హీరోలు పాన్ ఇండియా ఇమేజ్‌తో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మన సినిమాలకు తమిళనాట మంచి ఆదరణ లభిస్తోంది. ఈ గ్యాప్‌ను మన హీరోలు పక్కా ప్లానింగ్‌తో భర్తీ చేస్తే, కోలీవుడ్ మార్కెట్‌ను ఏలడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
ముందంజలో అల్లు అర్జున్ – ప్రభాస్
తమిళ డైరెక్టర్ల క్రేజ్‌ను వాడుకోవడంలో ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ అందరికంటే ముందున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ, లోకేష్ కనకరాజ్ లాంటి స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు. తమిళ తంబీల నాడి తెలిసిన ఈ దర్శకులతో సినిమాలు చేస్తే, బన్నీ అక్కడ తిరుగులేని మార్కెట్ సొంతం చేసుకోవడం ఖాయం. మరోవైపు ప్రమోషన్లలో తమిళంలో మాట్లాడుతూ తాను చెన్నై కిడ్ అంటూ తంబిల మనసు దోచుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు ఐకాన్‌స్టార్. మరోవైపు, ప్రభాస్ ‘బాహుబలి’ సమయం నుండే అక్కడ బలమైన పునాది వేసుకున్నారు. ఆయన చేసే భారీ బడ్జెట్ సినిమాలు కోలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే సత్తా ఉన్నవే.
పర్ఫెక్ట్ టైమ్
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. ఇద్దరికీ ట్రిపుల్ ఆర్‌తో కోలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ వచ్చింది. శంకర్‌తో చేసిన ‘గేమ్ ఛేంజర్’ హిట్ అయి ఉంటే ఇప్పటికే చరణ్‌కి కోలీవుడ్‌లో మంచి మార్కెట్ ఓపెన్ కావాల్సింది. ఇప్పుడు చరణ్ చేస్తు్న్న ‘పెద్ది’, తారక్ చేస్తున్న నీల్ సినిమా.. తమిళ ప్రేక్షకులను మెప్పిస్తే, అప్పుడు వీరికంటూ అక్కడ ఓన్ మార్కెట్ క్రియేట్ అవుతుందేమో చూడాలంటోంది ట్రేడ్ వర్గం. ప్రస్తుతం చేస్తు్న్న ‘వారణాసి’ ఏమాత్రం మెప్పించినా మహేష్ కూడా మంచి మార్కెట్ క్రియేట్ అవుతుందనే అంఛనాలున్నాయి.
స్టార్ పవర్ ఏది?
తమిళ సినీ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుతం అక్కడ ‘స్టార్ పవర్’ కొరత కనిపిస్తోంది. మన హీరోలు కేవలం అనువాద చిత్రాలకే పరిమితం కాకుండా, నేరుగా తమిళ దర్శకులతో సినిమాలు చేస్తూ, అక్కడ ప్రమోషన్లపై ఫోకస్ పెంచితే తమిళ నేల మీద పట్టు సాధించడం ఖాయం. పొలిటికల్ వేక్యూమ్‌ని విజయ్ క్యాష్ చేసుకున్నట్టు… ఇప్పుడు కోడంబాక్కంలో కనిపిస్తున్న స్టార్ పవర్ గ్యాప్‌ని మన హీరోలు క్యాష్ చేసుకోగలిగితే మళ్లీ తమిళనాడులో తెలుగు హీరోల జెండాలు రెపరెపలాడటం ఖాయం. టాలీవుడ్ తన సామ్రాజ్యాన్ని తమిళ నేల మీద విస్తరించుకోవడానికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదన్నది అనుభవజ్ఞులు చెబుతున్న మాట.
మరిన్ని సినిమా వార్తలు చదవండి
