జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ అసలు తగ్గడం లేదు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట వరుసగా బ్రాంచ్‌లు ఓపెన్ చేస్తున్నాడు. మొదట కూకట్ పల్లి వాసులకు తన చేపల కర్రీని రుచి చూపించిన ఆర్పీ ఆ తర్వాత మణికొండలో రెండో బ్రాంచ్ ఓపెన్ చేశాడు. ఈ కార్యక్రమానికి ఆర్పీ పట్నాయక్, హేమ వంటి సినీ ప్రముఖులతో పాటు హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, శాంతి వంటి జబర్దస్త్ కమెడియన్లు హాజరయ్యారు. ఇప్పుడు ముచ్చటగా మూడో బ్రాంచ్‌ను ఓపెన్ చేశాడు. విద్యార్థులు, ఉద్యోగులతో నిత్యం బిజిబిజీగా ఉండే అమీర్‌పేట ఏరియాలో తన చేపల పులుసు కర్రీ పాయింట్‌ను ప్రారంభించాడు. ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో తనకు కాబోయే భార్య లక్కీతో సహా పలువురు మంత్రులు, శ్రీకాంత్ దంపతులు, డైరెక్టర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు కాబోయే భార్య లక్కీతో కలిసి శ్రీకాంత్ దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాడు ఆర్పీ. ఇప్పటికే శ్రీకాంత్ చాలా సార్లు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తీసుకెళ్లారని కూడా చెప్పాడు. కాగా తన చేపల పులుసు బ్రాంచెస్ మూడు మాత్రమే ఉంటాయని, ఇకపై ఇదే పేరుతో ఫ్రాంచైజీస్ ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాడీ జబర్దస్త్ కమెడియన్.
కాగా కేవలం డబ్బు కోసమే కాకుండా.. క్వాలిటీ, క్వాంటిటీతో తన చేపల పులుసు కర్రీ పాయింట్ బిజినెస్ నిర్వహిస్తున్నట్లు ఆర్పీ పేర్కొన్నాడు. కట్టెల పొయ్యి మీదే చేపల పులుసు వండుతున్నామని, పార్శిళ్ల విషయంలో ప్లాస్టిక్ కూడా వాడకుండా చూస్తున్నామన్నాడీ కమెడియన్. ఇందులో భాగంగా ఒక కేజీ చేపల పులుసు తీసుకుంటే కవర్లలో కాకుండా కుండలో పెట్టి స్పెషల్‌గా ప్యాక్ చేసి ఇస్తామన్నాడు. కాగా అమీర్‌పేట బాగా రద్దీగా ఉండే ప్రాంతం. దీంతో మిగతా బ్రాంచ్‌లతో పోలిస్తే ఇక్కడ బిజినెస్‌లో బాగా లాభాలొస్తాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..