
మలయాళీ హీరో ఉన్ని ముకుందన్కు కేరళ హైకోర్టు షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆయన వేసిన పిటిషన్ ను తిరస్కరించింది. ఈ కేసుపై ఫిబ్రవరి 2023లో విధించిన స్టేను తాజాగా హైకోర్టు ఎత్తివేసింది. మహిళపై లైంగిక వేధింపుల కేసులో నటుడిని విచారించాలని న్యాయమూర్తి ఆదేశించారు. 2017లో ఉన్ని ముకుందన్‌పై ఒక మహిళ లైంగిక వేధింపుల కేసును దాఖలు చేసింది. తాను సినిమా ప్రాజెక్ట్ గురించి చర్చించడానికి కొచ్చిలోని అతని ఇంటికి వెళ్లానని..ఆ సమయంలో అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. వేధింపులకు గురిచేసాడని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
ఈ ఘటన 2017 ఆగస్టు 23న జరిగిందని.. ఆ తర్వాత సెప్టెంబర్ 15, 2017న సదరు మహిళ ఉన్ని ముకుందన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె చేసిన ఆరోపణలను ఖండించారు ఉన్నిముకుందన్. అంతేకాకుండా.. ఆమెపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. సెటిల్ మెంట్ లో ఆమె రూ. 25 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఉన్ని ముకుందని మేజిస్ట్రేట్, సెషన్స్ కోర్టుల్లో ఫిర్యాదులు దాఖలు చేశారు.
ఇరువర్గాలు సెటిల్‌మెంట్‌కు వచ్చాయని తెలుపుతూ హీరో కోర్టులో నకిలీ అఫిడవిట్ దాఖలు చేశాడని మహిళ తరఫు న్యాయవాది గతంలో ఫిర్యాదు చేశారు. ఈ అఫిడవిట్ ఆధారంగా కేరళ హైకోర్టు ఈ కేసుపై స్టే మంజూరు చేసింది. తాజాగా మే 23న ఈ కేసుపై స్టే ఎత్తివేస్తూ.. విచారణ జరపాలని ఆదేశించింది న్యాయస్థానం. ఉన్ని ముకుందన్ చివరిసారిగా మలికప్పురం చిత్రంలో కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.