Keerthy Suresh: డైరెక్షన్, డ్యాన్స్, వాయిద్యం.. మహానటి కీర్తి సురేశ్ సోదరి టాలెంట్‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే!
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో తనదైన నటనతో 'మహానటి'గా గుర్తింపు తెచ్చుకున్న ఆ స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఇష్టమే. కెమెరా ముందు ఆమె పండించే హావభావాలకు ఫిదా అవ్వని వారుండరుంటే నమ్మి తీరాల్సిందే. అయితే ఈ హీరోయిన్ కుటుంబం అంతా కళాకారుల నిలయమే.

తల్లి ఒకప్పుడు అగ్ర కథానాయిక, తండ్రి ప్రముఖ నిర్మాత. ఇక ఈమె సోదరి కూడా తక్కువేం కాదు. తెరపై కనిపించకపోయినా తెర వెనుక తన ప్రతిభను నిరూపించుకుంటూ వస్తోంది. ఇప్పటివరకు దర్శకురాలిగా, భరతనాట్య కళాకారిణిగా అందరికీ తెలిసిన ఆమె, ఇప్పుడు తనలోని మరో అద్భుతమైన కోణాన్ని బయటపెట్టింది. వాయిద్య కళాకారిణిగా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ అరుదైన ప్రతిభాశాలి మరెవరో కాదు.. కీర్తి సురేశ్ సోదరి రేవతి. తాజాగా ఆమె వాయిద్య సహకారం అందిస్తున్న వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
అమ్మవారి సన్నిధిలో అరంగేట్రం..
రేవతి తాజాగా వాయిద్య కళాకారిణిగా మారి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. కేరళలోని ప్రసిద్ధ అట్టుకల్ దేవి అమ్మవారి ఆలయంలో ఆమె తొలిసారిగా డోలు వాయించి తన భక్తిని చాటుకుంది. ఈ విషయాన్ని రేవతి తల్లి, సీనియర్ నటి మేనక సోషల్ మీడియా వేదికగా గర్వంగా పంచుకున్నారు. తెల్లటి చీర కట్టుకుని, నెత్తిన పూలు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా సిద్ధమైన రేవతి, తన గ్రూపు సభ్యులతో కలిసి ఎంతో ఏకాగ్రతతో డోలు వాయిస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తన కూతురు ఇలా ఒక వాయిద్యంపై పట్టు సాధించి, అందరి ముందు ప్రదర్శన ఇవ్వడం పట్ల మేనక ఆనందం వ్యక్తం చేశారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి..
రేవతి కేవలం వాయిద్యానికే పరిమితం కాలేదు, ఆమె ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆమె ఒక శిక్షణ పొందిన భరతనాట్య కళాకారిణి. అంతేకాకుండా విదేశాల్లో ఫిల్మ్ కోర్సు పూర్తి చేసి సినిమా రంగంపై అవగాహన పెంచుకుంది. కీర్తి సురేశ్ కెమెరా ముందు నటిగా రాణిస్తుంటే, రేవతి మాత్రం కెమెరా వెనుక ఉండి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. ‘థాంక్యూ’ అనే షార్ట్ ఫిలింకు ఆమె దర్శకత్వం వహించి ప్రశంసలు అందుకుంది. గతంలో ప్రసిద్ధ దర్శకుడు ప్రియదర్శన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి మెళకువలు నేర్చుకుంది. ‘మరక్కర్’, ‘వాశి’, ‘బరోజ్’ వంటి భారీ చిత్రాల నిర్మాణ బాధ్యతల్లోనూ ఆమె పాలు పంచుకోవడం విశేషం.
View this post on Instagram
వారసత్వాన్ని కొనసాగిస్తూ..
నటి మేనక, నిర్మాత సురేశ్ కుమార్ దంపతుల కుమార్తెగా రేవతికి చిన్నప్పటి నుంచే కళలపై మక్కువ ఎక్కువ. తల్లిదండ్రుల నుండి వచ్చిన కళా వారసత్వాన్ని ఆమె అద్భుతంగా కొనసాగిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ గా తన తల్లి ఎన్నో భాషల్లో గుర్తింపు తెచ్చుకుంటే, రేవతి మాత్రం తనలోని సృజనాత్మకతను దర్శకురాలిగా, వాయిద్య కళాకారిణిగా చాటుకుంటోంది. రేవతిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా? అని అభిమానులు ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు.
ఏదో ఒక రంగానికి పరిమితం కాకుండా, తనకు నచ్చిన ప్రతి కళను నేర్చుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. కీర్తి సురేశ్ అక్క రేవతి సాధించిన ఈ విజయం ఆమెలోని పట్టుదలకు నిదర్శనం. అటు దర్శకత్వం, ఇటు శాస్త్రీయ నృత్యం, ఇప్పుడు వాయిద్య సంగీతం.. ఇలా ప్రతి రంగంలోనూ తన ముద్ర వేస్తున్న రేవతి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభినందిస్తున్నారు నెటిజన్లు.
