రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్‌కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. దర్శన్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్‌కు వైద్య చికిత్స కోసం ఆరు వారాల పాటు బెయిల్ మంజూరు చేస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని షరతులు విధిస్తూ దర్శన్ చికిత్సకు అనుమతించింది. దర్శన్ తన పాస్ పోర్టును ట్రయల్ కోర్టు ముందు సరెండర్ చేయాలని సూచించింది. దర్శన్ తనకు కావాల్సిన ఏ ఆసుపత్రిలోనైనా వైద్యం చేయించుకోవచ్చని.. అయితే వారంలోగా దర్శన్ చికిత్స వివరాలు, ఆరోగ్య నివేదికను సమర్పించాలని ఆదేశించింది. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సెషన్స్ కోర్టులో సెప్టెంబరు 21న పిటిషన్ దాఖలు చేశారు దర్శన్. వెన్నుముకకు శస్త్ర చికిత్స చేయించుకుంటానని తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బళ్లారి సెంట్రల్ జైలు వైద్యులు, బళ్లారిలోని ప్రభుత్వ ఆస్పత్రిలోని న్యూరాలజీ విభాగాధిపతి సమర్పించిన వైద్య నివేదికను హైకోర్టు ధర్మాసనం ముందుంచారు దర్శన్ తరఫున న్యాయవాది. ఈ క్రమంలో ఇరువురి వాదనలు విన్న తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా దర్శన్‌కు ఆరు వారాల పాటు బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఆరు వారాల తర్వాత మళ్లీ జైలుకెళ్లాల్సిందే.