సినీ పరిశ్రమలో నటీనటులుగా తెరంగేట్రం చేసి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సెలబ్రెటీస్ చాలా మంది ఉన్నారు. తమ సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుని ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. కానీ చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నటీనటులుగా కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అనుకోని కారణాలతో ప్రాణాలను కోల్పోయారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో చాలా మంది యువ సెలబ్రెటీస్ కన్నుమూశారు. అందులో ఎంతో మంది మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. సిద్ధార్థ్ శుక్లా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, దివ్య భారతీ, జియా ఖాన్, తునీషా శర్మ వరకు ఇప్పటికీ జనాలు మర్చిపోలేని నటీనటులు. ఇక రెండు రోజుల క్రితం దంగల్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ సుహాని భట్నాగర్ సైతం అరుదైన చర్మ సమస్యతో ప్రాణాలు విడిచింది. ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీ.. ఎంతో మంది హృదయాలను భావోద్వేగానికి గురిచేసిన ఘటన జియా ఖాన్ సూసైడ్. ప్రాణంగా ప్రేమించిన ప్రియుడి మోసాన్ని భరించలేక ప్రాణాలు విడిచింది జియా ఖాన్. ఫిబ్రవరి 20న ఆమె జయంతి.
సుహానీ భట్నాగర్..
అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా బబితా ఫోగట్ పాత్రలో కనిపించింది. ఆమె ఫిబ్రవరి 17 న మరణించింది. ఆమె ఇంకా 19 ఏళ్లు మాత్రమే. కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈసారి తన కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమెకు చికిత్స అందించారు. అయితే పలు అనారోగ్య సమస్యల కారణంగా కోలుకోలేదు. ఆ తర్వాత చర్మ సమస్యతో ప్రాణాలు విడిచింది. ఆమె మరణం పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది.
జియా ఖాన్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటి జియా ఖాన్. సినిమాల్లో సహాయ పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆమె.. 2013లో 25 ఏళ్ల వయసులోనే ముంబైలోని తన నివాసంలో శవమై కనిపించింది. ఆమె మరణం ఆత్మహత్య అని అధికారులు నిర్ధారించారు. కానీ ఆమె తల్లి రబియా మాత్రం తన కూతురిని హత్య చేశారని ఆరోపించింది. దీంతో జియా ఖాన్ మృతిపై సీబీఐ విచారణ చేపట్టింది.
దివ్య భారతి…
కేవలం 16 ఏళ్ల వయసులోనే నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ డమ్ అందుకుంది. కానీ 19 ఏళ్ల వయసులోనే ఏప్రిల్ 5న 1993న కన్నుమూసింది. ముంబైలోని తన నివాసంలోని బాల్కనీ పడిపోయి మరణించింది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్..
ఎంఎస్ ధోని సినిమాతో దేశవ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్. ధోని పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకున్నాడు. దీంతో అతడి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అతడి వద్దకు క్యూ కట్టాయి. కానీ 2020 జూన్ 14న బాంద్రాలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ ది సూసైడ్ కాదని.. హత్యే అంటూ అతడి కుటుంబసభ్యులు, అభిమానులు ఆరోపించారు.
సిద్ధార్థ్ శుక్లా..
బుల్లితెరపై సూపర్ స్టార్ సిద్దార్థ్ శుక్లా.. బాలికా వధు (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్ ద్వారా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత పలు సీరియల్లో నటించిన ఆయన.. బిగ్ బాస్ సీజన్ 13లోకి అడుగుపెట్టి మరింత ఫాలోయింగ్ పెంచుకున్నాడు. ఆ తర్వాత 2021 సెప్టెంబర్ 2న గుండెపోటుతో మరణించారు. 41 ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచాడు.