
జయం రవి .. ప్రస్తుతం ఈ పేరు వార్తల్లో తెగ వినిపిస్తుంది. మొన్నటి వరకు స్టార్ హీరోగా కొనసాగిన జయం రవి ఇప్పుడు వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాడు. కోలీవుడ్ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి రవి విడాకుల వ్యవహారం ప్రస్తుతం చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 15 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత, ఈ జంట విడిపోతున్నట్లు 2024 సెప్టెంబర్‌లో ప్రకటించారు. అయితే, ఇటీవలి కాలంలో ఈ వివాదం మరిన్ని మలుపులు తిరిగి, తీవ్ర ఆరోపణలతో ముదిరింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో జయం రవి మీడియా ముందు ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు విడాకులు వచ్చే వరకు తాను సినిమాల్లో నటించనని, బ్రేక్ తీసుకుంటున్నానని తెలిపాడు జయం రవి. అంతే కాదు..
ఈ వివాదం వల్ల తాను తీవ్ర మానసిక క్షోభ, సైబర్ బుల్లీయింగ్ ఎదుర్కొంటున్నానని, అవి ఆగినప్పుడే మళ్లీ కెమెరా ముందుకు వస్తానని తెలిపాడు. అలాగే తన భార్య ఆర్తి, ఆమె కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశాడు రవి. పెళ్లయినప్పటి నుంచి తనను ఒక బానిసలా చూశారని, తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నానని వాపోయాడు. తనపై చేతబడి కూడా ప్రయోగించారని, మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఒకానొక దశలో ఆత్మహత్యకు కూడా యత్నించానని సంచలన వ్యాఖ్యలు చేశాడు రవి. తన ఇద్దరు పిల్లలను తనతో కలవనివ్వడం లేదని, వారికి బాడీగార్డ్స్‌ను కాపలా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విడాకుల సెటిల్‌మెంట్‌లో భాగంగా ఆర్తి భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె కోర్టులో జీవితాంతం తన మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.40 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. అయితే దీని పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. జయం రవి ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తారని, ఆయన రెమ్యునరేషన్‌తో పోలిస్తే ఈ డిమాండ్ చాలా ఎక్కువని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా రవి చేసిన ఆరోపణలపై ఆర్తి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిద్రపోతున్న సింహాన్ని లేపొద్దు. నా మౌనాన్ని బలహీనతగా అనుకోవద్దు. నా పిల్లలను, నా గౌరవాన్ని కాపాడుకోవడానికి నేను బయటకు వచ్చి నిజాలు చెప్పాల్సి వస్తుంది అంటూ ఒక పోస్ట్ పెట్టారు.