
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనదైన ముద్రవేశారు జగపతి బాబు. ఒకప్పుడు హీరోగా అలరించిన ఆయన.. ఇప్పుడు విలన్ గా, తండ్రిగా, అన్నగా కనిపిస్తూ మెప్పిస్తున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలతో ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఆస్తులు, సంపాదన గురించి ప్రశ్నలు ఎదురు కాగా.. ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “జగపతిబాబు వర్త్ ఎంత?” అని ప్రశ్నించగా, “ఇట్స్ మై వర్త్, దట్స్ ఆల్. ఆ అడిషనల్ సున్నాల వల్ల ఏం ఉపయోగం లేదు, అవి పెరిగిన కొద్దీ ఇబ్బందులే తప్ప” అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తన విషయానికి వస్తే డబ్బుల విషయంలో తాను “జీరో” అని, లెక్కలు చూసుకోవడం తనకు అస్సలు తెలియదని జగపతిబాబు అన్నారు.
చాలామంది అనుకున్నట్లుగా తన సంపద గ్యాంబ్లింగ్‌లోనో, మహిళల వెనుక ఖర్చు పెట్టడం వల్లనో పోలేదని ఆయన స్పష్టం చేశారు. క్యాసినో తనకొక ట్రిల్ అని, అది వినోదం కోసం మాత్రమేనని, అక్కడ కోట్లు పోవడం అనేది “నాన్సెన్స్” అని కొట్టిపారేశారు. తన ఆస్తి పోవడానికి గల కారణాలను వివరిస్తూ, “దాన ధర్మాలు, వ్యసనాలు, కుటుంబ ఖర్చులు, మోసపోవటాలు” అనే నాలుగు అంశాలను ప్రస్తావించారు. వీటిలో ఏ విధంగా ఎక్కువ పోయిందో తాను లెక్క చూడలేదని, అయితే డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోవడం, ఇతరుల మోసం లేదా తన చేతకానితనం వంటివి కారణాలు కావచ్చని తెలిపారు. ఎవరినీ నిందించడం తనకు ఇష్టం లేదని, అది తన ప్రాధాన్యత కాదని, తన నష్టాలకు తానే బాధ్యుడినని, అయితే దాని గురించి తాను అసంతృప్తిగా లేనని చెప్పారు.
గతంలో తాను ఆర్థికంగా ఇబ్బందులు పడినప్పుడు, తనకొక లెక్క వచ్చిందని జగపతిబాబు వెల్లడించారు. తన కుటుంబంలోని నలుగురు సభ్యులు జీవితాంతం ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్ ఫ్లైట్లలో ప్రయాణించడానికి, ఫైవ్ స్టార్ హోటల్స్‌లో బస చేయడానికి 30 కోట్ల రూపాయలు సరిపోతాయని తాను లెక్క కట్టానని తెలిపారు. ఈ లక్ష్యాన్ని తాను గత సంవత్సరమే చేరుకున్నానని, ఆ తర్వాత ఇంకో సున్నా చేర్చి 300 కోట్లు, 3000 కోట్లు అంటూ సంపాదన వెనుక పడలేదని పేర్కొన్నారు. తనకు కావాల్సిన లక్ష్యాన్ని చేరుకున్నానని, దీనికి మించి వస్తే అది బోనస్ అని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. డబ్బు, సంపద కన్నా ఆనందమే ముఖ్యమని జగపతిబాబు అన్నారు. వేల కోట్లు, లక్షల కోట్లు ఉంటే సంతోషంగా ఉండవచ్చనేది తప్పు భావన అని, కోవిడ్ సమయంలో వేల కోట్లు ఉన్నా ఆక్సిజన్ కొనుక్కోలేక చాలా మంది మరణించారని గుర్తు చేశారు. “ఊపిరి అనేది అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్” అని, డబ్బు పిచ్చితో ఊపిరి బిగించుకుంటే మనిషికి ఊపిరాడదని, అది తన ప్రాణాలకు ప్రమాదమని అన్నారు. ప్రస్తుతం మరోసారి జగపతి బాబు కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..