AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: యాక్షన్ వద్దు.. కామెడీ సినిమాలే కావాలి! మారుతున్న అభిమానుల అభిరుచి.. సాక్ష్యం ఇదే

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఒకే రకమైన కథలు నడవవు. కాలానికి అనుగుణంగా ప్రేక్షకుల అభిరుచి మారుతూనే ఉంటుంది. ఒకప్పుడు కేవలం ప్రేమకథలే రాజ్యమేలాయి, ఆ తర్వాత హారర్ కామెడీల హవా నడిచింది. గత ఐదేళ్లుగా చూస్తే బాక్సాఫీస్ వద్ద కేవలం రక్తం చిందే యాక్షన్ సినిమాలు, లార్జర్ దేన్ లైఫ్ కథలే కనిపిస్తున్నాయి.

Tollywood: యాక్షన్ వద్దు.. కామెడీ సినిమాలే కావాలి! మారుతున్న అభిమానుల అభిరుచి.. సాక్ష్యం ఇదే
Untitled Design (20)
Nikhil
|

Updated on: Jan 22, 2026 | 6:15 AM

Share

ఇప్పుడు సీన్ మారుతోంది. వెండితెరపై గంభీరమైన ముఖాలు చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు ఇప్పుడు కావాల్సింది కేవలం వినోదం మాత్రమేనని తాజా ఫలితాలు నిరూపిస్తున్నాయి. ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాల సరళిని గమనిస్తే, టాలీవుడ్ మళ్లీ తన మూలాలకు వెళ్తోందని స్పష్టమవుతోంది. మరి ఆ మార్పు ఏంటి? భారీ యాక్షన్ సినిమాల మధ్య నవ్వుల ప్రాముఖ్యత ఎలా పెరుగుతోంది?

సంక్రాంతి సినిమాలు..

ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ మినహా మిగిలిన ప్రధాన సినిమాలన్నీ కామెడీని నమ్ముకున్నవే. ‘మన శంకరవరప్రసాద్’, ‘అనగనగ ఒక రాజు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘నారీ నారీ నడుమ మురారి’.. ఇలా ప్రతి సినిమాలోనూ కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉన్నా, థియేటర్లలో ఆడియన్స్ ఎక్కువగా ఎంజాయ్ చేసింది మాత్రం ఆ వినోదాత్మక సన్నివేశాలనే. ఇది కేవలం ఒక పండగ సీజన్ కోసమే జరిగిందా లేక టాలీవుడ్ ట్రెండ్ నిజంగానే మారుతోందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

Anaganaga Oka Raju..

Anaganaga Oka Raju..

యాక్షన్ వద్దు.. వినోదమే ముద్దు..

ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఒక గట్టి నమ్మకం ఉండేది. కేజీఎఫ్, బాహుబలి, పుష్ప, కాంతార, సలార్ వంటి భారీ యాక్షన్ సినిమాలు వస్తేనే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, ఓ మోస్తరు బడ్జెట్ సినిమాలపై ఆసక్తి చూపరని నిర్మాతలు భావించేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. భారీ బడ్జెట్ సినిమాల కోసం ఏళ్ల తరబడి నిరీక్షించడం కంటే, హాయిగా నవ్వుకునేలా ఉండే సినిమాలను ఆదరించడానికి ప్రేక్షకులు మొగ్గు చూపుతున్నారు.

నిర్మాతలకు, హీరోలకు మేలు..

కామెడీ ట్రెండ్ బలపడితే అది తెలుగు ఇండస్ట్రీకి ఎంతో శుభపరిణామం. భారీ యాక్షన్ సినిమాలకు ఏడాదికి పైగా సమయం పడుతుంది. అదే కామెడీ సినిమాలు అయితే స్టార్ హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే అవకాశం ఉంటుంది. పాన్ ఇండియా హంగులు, గ్రాఫిక్స్ కోసం కోట్లు ఖర్చు చేసే అవసరం ఉండదు. తక్కువ రిస్క్‌తో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కథలో బలం ఉంటే కేవలం నవ్వులతోనే వంద కోట్ల వసూళ్లు సాధించవచ్చని నవీన్ పొలిశెట్టి వంటి హీరోలు నిరూపించారు. టాలీవుడ్‌లో కామెడీ ట్రెండ్ పురుడు పోసుకుందని చెప్పడానికి సంక్రాంతి సినిమాలు ఒక చిన్న సూచిక మాత్రమే. రాబోయే నెలల్లో విడుదలయ్యే మరికొన్ని కామెడీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, టాలీవుడ్ మళ్లీ వినోదాల స్వర్గధామంగా మారుతుందనడంలో సందేహం లేదు.