
ఐపీఎల్ టోర్నమెంట్ ఆసక్తికరంగా సాగుతోంది. మ్యాచ్ లు కూడా హోరాహొరీగా సాగుతున్నాయి. క్రికెట్ అభిమానులు కూడా వీటిని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఐపీఎల్ ప్రారంభోత్సవం ఈసారి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రారంభోత్సవంలో పలువురు స్టార్ నటీనటులు పాల్గొన్నారు. చాలా మంది నటీనటులు కూడా మ్యాచ్‌లను వీక్షించడానికి తమ అభిమాన జట్టుకు మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు. ఇదిలా ఉంటే బాలీవుడ్ ప్రముఖ నటుడు వరుణ్ ధావన్ మాత్రం ఐపీఎల్ సెక్యూరిటీ గార్డులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరుణ్ ధావన్ కోపగించుకోవడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. సోమవారం (మార్చి 25) ముంబై, గుజరాత్ మధ్య అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓ కుక్క స్టేడియంలోకి ప్రవేశించింది. అయితే కుక్క గ్రౌండ్‌లోకి రాకముందే సెక్యూరిటీ గార్డులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో చాలా మంది కుక్కను కాలితో తన్నారు. అయినా కుక్క అందరి నుంచి తప్పించుకుని క్రికెట్ గ్రౌండ్ లోకి పరుగులు తీసుకుంది. అయితే ఎట్టకేలకు సెక్యురిటీ గార్డులు కుక్కను మైదానం నుంచి వెళ్లగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే కుక్కను తన్నిన సెక్యూరిటీ గార్డులపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిలో నటుడు వరుణ్ ధావన్ కూడా ఒకరు. జంతు ప్రేమికుడు అయిన వరుణ్ ధావన్.. కుక్కను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డు తన్నుతున్న వీడియోను షేర్ చేస్తూ, ‘ఇది కుక్క. ఫుట్‌బాల్ కాదు. ఆ కుక్క ఎవరినీ కరిచేందుకు రాలేదు. ఎవరికీ ప్రమాదం కూడా తలపెట్టలేదు. కుక్కను ఆపడానికి హింసను ఉపయోగించే బదులు, వారు మరొక మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంది’ అని సామాజిక మాధ్యమాల వేదికగా ఫైర్ అయ్యారు వరుణ్.
వరుణ్ ధావన్‌తో పాటు నటి వేదిక కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ‘‘కుక్క మా సొత్తు అంటూ తన్నుతున్నారు. జంతు హింస మన దేశ క్రీడగా మారిందా? జంతు హింసకు వ్యతిరేకంగా సరైన చట్టాలు లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇలా జంతువులను చిత్రహింసలకు గురిచేస్తూ తమను తాము మనుషులమని చెప్పుకునే ఈ మనుషులకు సిగ్గుండాలి. జంతువులను కొట్టడం, తన్నడం, హింసించడం మన సంస్కృతిగా మారింది. వీడియోలో కుక్కను ఓ వ్యక్తి బలంగా కొట్టాడు. జంతువులను గౌరవించడం మనం ఎప్పుడు నేర్చుకుంటాం?’ అని ఫైర్ అయ్యింది వేదిక. కుక్కను కొట్టిన వీడియోను పలువురు షేర్ చేయగా, భద్రతా సిబ్బంది చర్యను పలువురు ఖండించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.