Mahesh Babu-Namratha: సినిమాల్లోనే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఎంతో మంది చిన్నారులకు ఉచితంగా వైద్యం అందిస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నాడీ హ్యాండ్సమ్ హీరో. ఇక అతని సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా భర్త అడుగుజాడల్లోనే నడుస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక మంచి పనిలో పాలుపంచుకుంటోంది. తాజాగా మహేశ్ దంపతులు మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలోని నారాయణపేట ప్రాంతంలో ఉన్న మహిళా సంఘాలు నిర్వహిస్తున్న చేనేత వస్త్రాల వ్యాపారానికి తమ వంతు చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చారు. ఆరుణ్య నారాయణపేట పేరుతో ఆన్‌లైన్ వస్త్రాల వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఈ సంస్థ ప్రతినిధులు తాజాగా మహేశ్-నమ్రతలను కలిశారు. ఈ సందర్భంగా స్వయం సహాయక సంఘాల ద్వారా తమ కాళ్లపై తాము నిలబడుతోన్న మహిళల కృషిని మహేశ్ దంపతులు ప్రశంసించారు. చేనేత వృత్తిని మరో స్థాయికి తీసుకెళ్లడం ఎంతో గొప్ప విషయని కితాబిచ్చారు.
కాగా మహేష్- నమ్రతా అందించిన ప్రోత్సాహం తమకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందంటున్నారు ఆరుణ్య నారాయణపేట సంస్థ ప్రతినిధులు. వారు తమను బాగా రిసీవ్ చేసుకున్నారని చేనేత మహిళలు హర్షం వ్యక్తం చేశారు. కాగా చేనేత మహిళలతో మహేష్, నమ్రతా కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్‌తో కలిసి SSMB 28 లో నటిస్తున్నాడు. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అతడు, ఖలేజా సినిమాల అనంతరం సుమారు 11 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కనుండనుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..