మణిరత్నం సినిమాలకు ఓ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాల్లో ఎదో సోల్ ఉంటుంది. ప్రేక్షకులను కట్టిపడేయడంలో మణిరత్నం దిట్ఠా.. ఆయన సినిమాలు చూసిన ప్రతిఒక్కరు చెప్పే మాట ఇది. అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి మణిరత్నం సినిమాలు. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ప్రెస్టీజియస్ సినిమా పొన్నియిన్ సెల్వన్(Ponniyin Selvan). లైకా ప్రొడక్షన్స్, మెడ్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రెండు భాగాలుగా విడుదల కానుంది పొన్నియిన్ సెల్వన్. పీయస్-1ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 30న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక సమయంలో విడుదల చేయనున్నారు. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ఇది. అయితే ఈ చిత్రంలోంచి చోళ చోళ అనే పాటను విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ.. ‘మణిరత్నం గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాను. ఇప్పుడు ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను చేశాను. ఎవరెవరికో దక్కాల్సిన పాత్ర నాకు దక్కింది. కల్కి గారు రాసిన నవలే ఈ పొన్నియన్ సెల్వన్. ఎంతో మంది ఈ నవలను సినిమాను తీయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మణి గారి వల్ల ఈ చిత్రం తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. తోటీ నటీనటుల వల్ల ఎంతో నేర్చుకున్నాను. ప్రతీ ఒక్క పాత్రకు ఓ లక్ష్యం ఉంటుంది.. ఆ గమనంలో ఉండే డ్రామా అద్భుతంగా ఉంటుంది. ఈ కథ నేల మీద, సముద్రాలు, అడవుల్లో జరుగుతుంది. ఇలాంటి చిత్రాలు తీయాలంటే మణిరత్నం గారు, ఏఆర్ రెహ్మాన్ గారు ఉండాలి. అప్పట్లోని రాజకీయాల మీద ఈ చిత్రం ఉంటుంది. రియల్ కారెక్టర్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చాలా రీసెర్చ్ చేసి ఈ నవలను రాశారు. అత్యధికమంది కొన్న పుస్తకంగా పొన్నియన్ సెల్వన్ రికార్డులు క్రియేట్ చేసింది. రవివర్మన్ కెమెరాపనితనం మీరు చూడబోతోన్నారు. వెయ్యేళ్ల క్రితం జరిగిన చరిత్రను చూపించేందుకు రాబోతోన్నాం’ అని అన్నారు.