కార్తీ.. కోలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న ఈ హీరో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమే. యుగానికొక్కడే, ఆవారా, ఖైదీ, ఖాకీ వంటి సినిమాలతో టాలీవుడ్లోనూ బోలెడు అభిమానులను సొంతం చేసుకున్నాడీ హీరో. ఇక ఊపిరి సినిమాతో నేరుగా తెలుగు ఆడియెన్స్‌ను పలకరించాడు. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్‌లోనూ కార్తీ అద్భుతంగా నటించాడని ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం కార్తీ నటిస్తోన్న తాజా చిత్రం సర్దార్. అభిమన్యుడితో ఆకట్టుకున్న పీఎస్ మిత్రన్ స్పై థ్రిల్లర్ నేపథ్యంతో ఈ సినిమాను తెరకెక్కించారు. రాశీఖన్నా, రజిషా విజయన్, లైలా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఊపిరి సినిమాలో కార్తీతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకున్న కింగ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ..
‘నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నాగార్జున అన్నయ్య ఈ ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. అలాగే ఈ సినిమాని నాగార్జున గారు తెలుగు విడుదల చేయడం చాలా థ్రిల్ గా వుంది. సర్దార్ నా కెరీర్ లో చాలా స్పెషల్ మూవీ. తొలిసారి తండ్రి కొడుకులుగా నటించాను. ఇందులో స్పై పాత్ర చాలా స్పెషల్. సర్దార్ గ్రేట్ హీరో. ఏమీ ఆశించకుండా దేశం కోసం పని చేసిన హీరో. ఆ పాత్ర చేసినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను. పోలీస్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఈ జనరేషన్ కు తగ్గట్టుగా వుంటుంది. ఒక సినిమాలో రెండు జనరేషన్లు చూపించడం ఒక సవాల్. ఇది ఇండియన్ స్పై థ్రిల్లర్. మిత్రన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. అభిమన్యుడులో డిజిటల్ క్రైమ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లే ఇందులో కూడా మన కళ్ల ముందు వుండి, మనం పెద్దగా పట్టించుకొని ఒక ముఖ్యమైన విషయాన్ని చూపించారు. సర్దార్ లో అది గొప్ప సర్ ప్రైజ్ గా వుంటుంది. రాశి ఖన్నా, రజీషా, లైలా అద్భుతంగా నటించారు. జార్జ్ కెమరా పనితనం బ్రిలియంట్ గా వుంటుంది. జీవి పప్రకాష్ కుమార్ చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాత లక్ష్మణ్ గారికి కృతజ్ఞతలు. నా కెరీర్ లో బిగ్ బడ్జెట్ చిత్రమిది. దాదాపు పాన్ ఇండియా షూట్ చేశాం. దీపావళి కి ఖైధీ సినిమా వచ్చింది. ఈ దీపావళికి ఒక పండగలా క్రాకర్ లా సర్దార్ సినిమా రాబోతుంది. అక్టోబర్ 21న సర్దార్ వస్తోంది. అందరూ తప్పకుండా థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి’ అని కోరారు.
కాగా ప్రసంగం ప్రారంభించే ముందు యుగానికి ఒక్కడు సినిమాలోని ‘రేయ్ ఎవర్రా మీరంతా’ అంటూ తన ఐకానిక్ డైలాగును మరోసారి రీక్రియేట్ చేశాడు కార్తీ. దీంతో ఆడిటోరియం మొత్తం ఈలలు, కేకలతో మోగిపోయింది. అలాగే నాగార్జున నటించిన నిన్నే పెళ్లాడతా సినిమాలోని కన్నుల్లో నీ రూపమే పాటను ఆలపించి అందరినీ ఆకట్టుకున్నాడీ స్టార్ హీరో.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..