బిగ్ బ్రేకింగ్ : గొల్లపూడి మారుతీరావు కన్నుమూత..!

|

Dec 12, 2019 | 1:55 PM

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావుకి  ముగ్గురు కుమారులు. అయితే ‘ప్రేమ పుస్తకం’అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ గొల్లపూడి చిన్నకుమారుడు శ్రీనివాస్ చనిపోయారు. చిన్న కుమారుడు జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు గొల్లపూడి. తండ్రి బాటలోనే పెద్ద కుమారుడు సుబ్బారావు, రెండో కుమారుడు రామకృష్ణ రచనపై ఆసక్తి పెంచుకున్నారు. […]

బిగ్ బ్రేకింగ్  : గొల్లపూడి మారుతీరావు కన్నుమూత..!
Follow us on

ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో జన్మించిన గొల్లపూడి మారుతీరావుకి  ముగ్గురు కుమారులు. అయితే ‘ప్రేమ పుస్తకం’అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ గొల్లపూడి చిన్నకుమారుడు శ్రీనివాస్ చనిపోయారు. చిన్న కుమారుడు జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు గొల్లపూడి. తండ్రి బాటలోనే పెద్ద కుమారుడు సుబ్బారావు, రెండో కుమారుడు రామకృష్ణ రచనపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రస్తుతం తనయులిద్దరూ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు.

రచయిత, నటుడు, సంపాదకుడు, వ్యాఖ్యాతగా గొల్లపూడి విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు.  ఆయన నటించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1982లో రిలీజయ్యింది. ఆది సాయికుమార్ నటించిన జోడి మూవీలో చివరిసారిగా నటించారు. అప్పటివరకు రచయితగా కొనసాగిన ఆయన,  42 ఏళ్ల వయస్సులో మొట్టమొదటిసారిగా సినిమాలో నటించడం ప్రారంభించారు.  మూడున్నర దశాబ్దాలకుపైగా  తెలుగు సినీ రంగానికి ఎన్నో సేవలు అందించారు.  సుమారు 290కిపైగా చిత్రాల్లో నటించిన గొల్లపూడి మారుతీరావు.. ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా, హాస్యనటుడిగా సినిమాలకు నిండుదనం తీసుకువచ్చారు.  గొల్లపూడికి ‘గద్దముక్కు పంతులు’ అని  దర్శకుడు కోడిరామకృష్ణ నిక్ నేమ్ పెట్టారు.

దాశరథి ప్రోత్సహంతో గొల్లపూడి మారుతీరావు  సినీ రచయితగా మారారు. ప్రముఖ పాటల రచయిత  దేవులపల్లి కృష్ణశాస్త్రితో కలిసి రచనలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.  1963లో 13 ఏళ్ల వయస్సులోనే ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన ఈ మహా నటుడు,  14 ఏళ్ల వయస్సులోనే ‘ఆశాజీవి’ అనే మొదటి కథ  రాశారు.  దుక్కిపాటి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన ‘డాక్టర్ చక్రవర్తి’ చిత్రానికి తొలిసారిగా రచనా బాధ్యతలు స్వీకరించారు.  కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆత్మగౌరవానికి కూడా గొల్లపూడే రచయిత. సాయంత్రం 6 గంటల తర్వాత షూటింగ్‌కు వెళ్లడం ఆయనకు పెద్ద ఇబ్బందిగా ఉండేదట.

విద్యార్థి దశలోనే నాటకాల్లో నటించిన గొల్లపూడి,  రాఘవ కళా నికేతన్ పేరుతో నాటక బృందానికి నాయకత్వం వహించారు.
9 నాటకాల్లో నటించడమే కాకుండా,  పలు నాటకాలకు రచన, దర్శకత్వ సహకారం అందించారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 6 నంది పురస్కారాలు అందుకున్న నటుడు గొల్లపూడి మారుతీరావు.

గొల్లపూడి రచనలుః 12 నవలలు, 4 కథా సంపుటాలు, 3 పిల్లల కథలు.

గొల్లపూడి నటించిన ప్రముఖ చిత్రాలుః ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, మనిషికో చరిత్ర, తరంగిణి, యముడికి మొగుడు, సంసారం ఒక చందరంగం, స్వాతిముత్యం, స్వాతి, గూఢచారి నెం.1, ఆలయ శిఖరం, అభిలాష, పల్లెటూరి మొనగాడుఛాలెంజ్, ప్రేమ, ఆదిత్య 369,
వజ్రం, మురారి, బ్రోకర్, లీడర్, దరువు, సుకుమారుడు, రౌడీ ఫెల్లో, కంచె, సైజ్ జీరో, మనమంతా, ఇజం, జోడి

 గొల్లపూడి రచయితగా పనిచేసిన ప్రముఖ చిత్రాలుః డాక్టర్ చక్రవర్తి, రైతు కుటుంబం, దొరబాబు, ఓ సీత కథ, అన్నదమ్ముల అనుబంధం, శుభలేఖ, కళ్లు