రాజకీయ నాయకుల పుత్రరత్నాలు సినిమాల్లోకి రావడం కామనే. దేశవ్యాప్తంగా ఈ కల్చర్ ఉంది. అలానే కర్నాటకలో చాలామంది ప్రముఖుల వారసులు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేట్ టెస్ట్ చేసుకున్నారు. కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్, జమీర్ అహ్మద్ కుమారుడు జైద్ ఖాన్, చెలువరాయ స్వామి తనయుడు సచిన్.. కన్నడ ఇంస్ట్రీలో తమదైన స్టైల్లో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో కర్నాటక మాజీ మంత్రి, సౌత్‌లో అందరికీ తెలిసిన వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి త్వరలోనే వెండితెరపై అరంగేట్రం చేయనున్నారు. త్వరలోనే కిరీటి ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కన్నడ డైరెక్టర్ రాధాకృష్ణ రెడ్డి తెలిపారు. ఈ దర్శకుడు కన్నడలో ‘మాయాబజార్’ అనే మూవీ తెరకెక్కించాడు. కిరీటి ఇప్పటికే డ్యాన్స్, యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు రాధాకృష్ణ రెడ్డి వెల్లడించారు. నటుడు కావాలన్నది కిరీటి చిన్ననాటి కల అని చెప్పుకొచ్చారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ‘జాకీ’ మూవీ ఇన్సిరేషన్‌తోనే కిరీటి ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించారు. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాలను కూడా ప్రొత్సహించే సాయి కొర్రపాటి.. కిరీటి తొలి చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కన్నడ, తెలుగు భాషల్లో ఏక కాలంలో రూపుదిద్దుకోనుంది.
కన్నడ ఇండస్ట్రీనే కాకుండా ఇటు టాలీవుడ్‌లోని చాలామంది నటీనటులు, దర్శక నిర్మాతలతో గాలి జనార్దన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తన తనయుడ్ని ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి అవసరమైన అన్ని శిక్షణలు జనార్దన్ రెడ్డి ఇస్తున్నట్లు సంబంధీకులు చెప్తున్నారు.
Also Read: దేశంలో పావురాళ్ల కలకలం.. తాజాగా ఖమ్మం జిల్లాలో.. అసలు కథేంటి..?