
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య స్నేహం ఎలా మొదలైందో వివరించాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తమ మధ్య పరిచయం మొదలైందని రాజీవ్ కనకాల తెలిపాడు. వాస్తవానికి హీరోగా జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలని కోసం ఆయనకు డబ్బింగ్ చెప్పమని రాజీవ్ కనకాలను సంప్రదించారట. అయితే తన వాయిస్ జూనియర్ ఎన్టీఆర్‌కు సరిపోదని భావించి రాజీవ్ ఆ అవకాశం వదులుకున్నాడట.
స్టూడెంట్ నెంబర్-1 సినిమా షూటింగ్‌లో ఇద్దరం కలిశాం. అయితే పరిచయం అయిన రెండో రోజునే ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని రాజీవ్ గుర్తు చేసుకున్నాడు. తన కళ్లద్దాలపై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఓ కామెంట్‌కు రాజీవ్ కనకాల బాధపడ్డాడు. జక్కన్నకి ఈ విషయం చెప్పడంతో ఎన్టీఆర్ మరుసటి రోజు వచ్చి రాజీవ్‌ను పలకరించి, వారి మధ్య స్నేహానికి బాటలు వేశారని వివరించాడు. క్రమంగా ‘రాజు గారు’ అని పిలిచే స్థాయి నుంచి ‘రాజాగా’ అని పిలిచేంత స్నేహితులమయ్యామని రాజీవ్ కనకాల తెలిపాడు. అప్పటి నుంచి తనకు, ఎన్టీఆర్‌కు మధ్య ఉన్న స్నేహం.. ఇప్పటికీ కొనసాగుతోందని రాజీవ్ కనకాల స్పష్టం చేశాడు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రచారం సమయంలో జరిగిన ప్రమాదం గురించి కూడా రాజీవ్ కనకాల ప్రస్తావించాడు. ఆ ప్రమాదం జరిగినప్పుడు తాను కూడా జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు వాహనంలో ఉన్నానని, బయటకు ఎలాంటి గాయాలు కాకపోయినా, అంతర్గతంగా కంప్రెషన్స్ వంటి సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపాడు. ఆ ప్రమాదంలో వాహనంలో ఉన్న వారందరూ ప్రాణాలతో బయటపడటం అదృష్టమని రాజీవ్ అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా పెద్ద గాయాలు అయ్యాయని, అయితే చికిత్సతో ఆయన చాలావరకు కోలుకున్నారని చెప్పాడు. మరోవైపు ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. అతడు అంటే తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని రాజీవ్ కనకాల అన్నాడు. అడవిరాముడు సినిమాలో మాత్రమే ప్రభాస్‌తో కలిసి నటించానని, అందులో ఆయనను ఆటపట్టించే కామెడీ విలన్ పాత్ర పోషించానని తెలిపాడు. ప్రభాస్ చాలా కూల్ పర్సన్ అని తెలిపాడు. ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం రాలేదని చెప్పాడు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..