Raghava Lawrence: ఇకపై ఆ పని చేయనని మాస్టర్ కు మాటిచ్చా.. లారెన్స్‌ను కలిసిన విక్రమార్కుడు ఛైల్డ్ ఆర్టిస్ట్

ఛైల్డ్ ఆర్టిస్టుగా సుమారు 25 కు పైగా సినిమాలు చేశాడు రవి రాథోడ్. ‘రేయ్ సత్తి.. బాలు అటు వచ్చిందా?’ అంటూ తన హుషారైన నటనతో ఆడియెన్స్ ను మెప్పించాడు. చిన్నప్పుడే ఎంతో ఈజ్ గా నటించిన ఆ కుర్రాడిని చూసి భవిష్యత్ లో మంచి నటుడు అవుతాడనుకున్నారు చాలా మంది. కానీ..

Raghava Lawrence: ఇకపై ఆ పని చేయనని మాస్టర్ కు మాటిచ్చా.. లారెన్స్‌ను కలిసిన విక్రమార్కుడు ఛైల్డ్ ఆర్టిస్ట్
Ravi Rathod, Raghava Lawrence

Updated on: Jul 15, 2025 | 7:15 PM

విక్రమార్కుడు, ఆంధ్రావాలా, ఖడ్గం, జెమిని, మాస్‌, బొమ్మరిల్లు, డాన్‌, హైదరాబాద్‌ నవాబు, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌.. ఇలా దాదాపు 25కు పైగా సూపర్ హిట్ సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు రవి రాథోడ్. అయితే చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో రోడ్డున పడ్డాడు రవి. ఈ విషయం తెలుసుకున్న హీరో రాఘవ లారెన్స్ రవిని దత్తత తీసుకుని మంచి స్కూల్‌లో చేర్పించాడు. కానీ అతను మాత్రం ఇంటికి తిరిగొచ్చేశాడు. చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే సమయంలో తాగుడుకు బానిసైపోయాడు. మందు లేకపోతే బతకలేను అన్నంత దీన స్థితికి చేరుకున్నాడు. ఒక యూట్యూబర్ రోడ్లపై తిరుగుతోన్న రవి రాథోడ్ ను గుర్తు పట్టడం, అతని వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ నటుడి గురించి అందరికీ తెలిసింది. ఓ ఇంటర్వ్యూకు హాజరైన రవికి చిన్నప్పుడు చదువు చెప్పించాలని చూసిన లారెన్స్‌ను మళ్లీ కలవలేకపోయావా? అంటే.. భయంగా ఉందన్నాడు. స్కూలు నుంచి ఎందుకు పారిపోయావని తిడతాడేమో.. కొడతాడేమోనని వెనకడుగు వేసినట్లు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న లారెన్స్‌ నిన్ను తిట్టను, కొట్టను.. ఒక్కసారి వచ్చి కలువురా అని ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టాడు.

మాస్టర్ ఆ మాట అనడంతో..

దీంతో ఎట్టకేలకు రవి రాథోడ్ చెన్నై వెళ్లి లారెన్స్ ను కలిశాడట. అతని పరిస్థితి చూసి చలించిపోయిన లారెన్స్‌ వెంటనే రూ.50 వేలు ఆర్థిక సాయం చేశాడు. ‘ ఆల్కహాల్‌ అడిక్షన్‌ తగ్గేందుకు నాకు అన్ని మెడికల్ టెస్టులు చేయించారు. మందులు కూడా ఇచ్చారు. అయితే లారెన్స్ మాస్టర్ మొదట‌ నన్ను చూడగానే ఓ మాటన్నారు. నీలా తాగేవాళ్లకు నేను సపోర్ట్‌ చేయను. ఏదో నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసని ఇలా సపోర్ట్‌ చేస్తున్నానంతే! అన్నారు. నన్ను చెన్నైలోనే ఉండమన్నారు. అయితే నాతో పాటు ఫ్రెండ్స్‌ వచ్చారని హైదరాబాద్‌కు వచ్చేశాను. మాస్టర్‌ డబ్బు సాయం కూడా చేశారు. ఆ డబ్బుతోనే కొత్త మొబైల్ కొనుక్కున్నాను. చెన్నై నుంచి వచ్చాక నేను తాగుడు మానేశాను. మెడిసిన్‌ వాడినప్పుడు మందు తాగితే చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్‌ హెచ్చరించాడు. అందుకే ఇప్పుడు దాని జోలికి వెళ్లడం లేదు’ అని చెప్పుకొచ్చాడు రవి రాథోడ్.

మరి రవి రాథోడ్‌.. రాఘవ లారెన్స్ కు ఇచ్చిన మాటపై నిలబడతాడా?  అన్నీ మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తాడా? ఈ విషయాలకు సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..