
తెలుగు సినిమాల్లో విలన్ క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటే.. హీరోయిజం అంతగా హిట్ అవుతుందని విశ్వసించేవారు. తెలుగులో చాలా కొద్ది మంది మాత్రమే విలన్ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. వారిలో రామిరెడ్డి ఒకరు. టాలీవుడ్ సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు రామిరెడ్డి. 1990ల్లో తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించారు. నటనతోపాటు.. కంటిచూపులోనూ.. గొంతులోనూ విలనిజం పండించగల గొప్ప నటుడు ఆయన. ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోగా ధీటుగా విలన్ పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకులను అలరించారు. జర్నలిస్టుగా కెరీర్ స్టార్ చేసి.. ఆ తర్వాత పాన్ ఇండియా విలన్ గా మారి సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు రామిరెడ్డి.
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ సాధారణ కుటుబంంలో జన్మించిన రామిరెడ్డికి.. సామాజిక స్పృహ ఎక్కువ. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత ది మున్సిఫ్ డైలీ అనే పత్రికలో విలేకరిగా పనిచేశారు. స్కూల్ నుంచి డిగ్రీ వరకు హైదరాబాద్ లోనే చదువుకోవడంతో తెలంగాణ స్లాంగ్ లోనే మాట్లాడేవాడు. అంతేకాదు హిందీ, ఉర్దూ ధారళంగా మాట్లాడేవాడు. జర్నలిస్టుగా పనిచేస్తూనే సినిమా ఈవెంట్స్ కవర్ చేసేవాడు. ఒకరోజు దర్శకుడు కోడి రామకృష్ణకు ఫోన్ చేసి ఇంటర్వ్యూ కావాలని అడగారట. అప్పుడే అంకుశం సినిమాకు పవర్ ఫుల్ విలన్ కోసం ఎదురుచూస్తున్న చిత్రయూనిట్.. అక్కడకు వెళ్లిన రామిరెడ్డిని చూసి సినిమా అవకాశం ఇచ్చారట.
అంకుసం సినిమా తర్వాత ఒసేయ్ రాములమ్మా, పెద్దరికం, అమ్మోరు, గాయం, అనగనగా ఒక రోజు, అడవిచుక్క, నాగప్రతిష్ట, తెలుగోడు, జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబు, వీడు మనవాడే వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్ పురి భాషలలో దాదాపు 250 సినిమాల్లో నటించారు రామిరెడ్డి. పవర్ ఫుల్ గా ప్రేక్షకులను అలరించిన రామిరెడ్డి హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. మొదట లివర్ సమస్యగా మొదలై ఆ తర్వాత కిడ్నీ ఫంక్షనింగ్ పై కూడా ప్రభావం చూపించింది. ఆ తర్వాత అది క్యాన్సర్ గా మారింది. ఆ సమయంలో రామిరెడ్డి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అయినా ఎంతో ధైర్యంతో క్యాన్సర్ తో పోరాడాడు. 2011 ఏప్రిల్ 14న హైదరాబాద్ లో 52 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడాచురు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కోట్లు సంపాదించిన రామిరెడ్డి.. తన ఆస్తి మొత్తం చికిత్సకు ఖర్చు చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..