సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. సెలబ్రెటీల ఫోటోలు అయితే లెక్కేలేదు. కాగా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. పై ఫోటోలో ఎంతో పద్దతిగా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె… లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అదరగొట్టేస్తుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ముక్కు సూటిగా మాట్లాడే తత్వం ఆమెది.. అదే ఆమెకు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అంతేకాదు ఇండస్ట్రీలోని నెపోటిజం పై ఎన్నోసార్లు విమర్శలు గుప్పించింది. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని అమ్మాయి సినీరంగంలో అగ్ర కథానాయికగా ఎదిగింది. ఇంతకూ ఆమె ఎవరంటే..
చదువు మధ్యలోనే మానేసి 15 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయింది ఆమె. ఉండేందుకు చోటు లేకపోవడంతో ఫ్లాట్ ఫామ్ పై జీవించింది. ఇండస్ట్రీలో అవకాశాలను ఒడిసిపట్టుకుని ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికే ఆమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు. ఇన్నాళ్లు వెండితెరపై అలరించిన ఆమె ఇప్పుడు పార్లమెంట్ లో అడుగుపెట్టింది. తనే బీటౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కోరిక. అందుకు తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో 15 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి ముంబైకి పారిపోయింది కంగనా. కొన్ని రోజులు చిన్న పనులు చేస్తూ ఫ్లాట్ ఫామ్ పై నిద్రపోయింది. 19 ఏళ్ల వయసులో నటిగా తొలి అవకాశం అందుకుంది.
డైరెక్టర్ అనురాజ్ బసు దర్శకత్వం వహించిన గ్యాంగ్ స్టర్ చిత్రంతో కంగనా బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె నటనకు ప్రసంసలు అందుకుంది. ఆ తర్వాత ఫ్యాషన్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. హిందీలో క్వీన్, మణికర్ణక, తను వెట్స్ మను వంటి చిత్రాలతో స్టార్ డమ్ అందుకుంది. తెలుగులో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది కంగనా. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఆమె నటించిన తను వెడ్స్ మను సినిమా రూ.100 కోట్లు దాటిన తొలి హీరోయిన్ సెంట్రిక్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ముక్కుసూటిగా మాట్లాడడంతో బాలీవుడ్ పెద్దలు ఆమెను దూరం పెట్టారు. ఆమెకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. దీంతో తనే నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తుంది. ఇప్పుడు బీజీపీ పార్టీలో చేరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఆమె ఎంపిగా పోటీ చేసి ఘన విజయం సాధించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి