
తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే నటులలో ఐరన్ లెగ్ శాస్త్రి ఒకరు. వెండితెరపై పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన అసలు పేరు విశ్వనాథ శాస్త్రి. కానీ ఆయన ఐరన్ లెగ్ పేరుతోనే పాపులర్ అయ్యారు. ప్రేమఖైదీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆయన జంబలకిడిపంబ, అప్పుల అప్పారావు వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. స్టార్ కమెడియన్గా ఫేమస్ అయిన ఆయన.. ఐరన్ లెగ్ అనే పదాన్ని తన పేరుకు ముందు జత చేశారు. అప్పటి నుంచి ఐరన్ లెగ్ శాస్త్రిగానే కొనసాగారు. అయితే ఆనతి కాలంలోనే స్టార్ డమ్ అందుకున్న ఆయన.. అంతే తర్వగా సినిమాలకు దూరమయ్యారు.
ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయారు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు అనారోగ్య సమస్యలతో చిన్న వయసులోనే కన్నుమూశారు. ఇక ఆయన మరణించిన తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన కొడుకు కూడా ఎక్కువ రోజులు ఉండలేక వెళ్లిపోయారు. అయితే గతంలో పలు ఇంటర్వ్యూలలో తన తండ్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ప్రసాద్. పురోహిత్యం కోసం హైదరాబాద్ వచ్చిన విశ్వనాథ శాస్త్రి.. సినిమా ప్రారంభోత్సవాలకు పూజలు నిర్వహించేవారట. అదే సమయంలో ఒకసారి హారతి ఆయన దగ్గరకు రాగానే ఆరిపోవడంతో.. అక్కడున్నవారంతా నవ్వేశారట. ఇదంతా చూసిన డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ఆయనకు ఓ పాత్ర క్రియేట్ చేసి సినిమాల్లో అవకాశం కల్పించారు. అలా ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ శాస్త్రిగా గుర్తింపు సంపాదించుకున్నారు.
అయితే అదే ట్యాగ్ లైన్ ఆయన జీవితాన్ని నిర్ణయించిందనే చెప్పాలి. ఒకసారి పనిమీద బెంగళూరు వెళ్తుంటే అర్ధరాత్రి బస్ ఆగిపోయిందట.. ఐరన్ లెగ్ శాస్త్రి బస్సులో ఉండడం వల్లే ఆగిపోయిందని.. బస్ రీపేర్ అయ్యాక ఆయనను అక్కడే వదిలేసి వెళ్లిపోయారట. అంతేకాకుండా.. సినిమాల్లో ఆయనను పెట్టుకుంటే మూవీ ఆగిపోతుందని.. డిజాస్టర్ అవుతుందనే రూమర్స్ ఇండస్ట్రీలో క్రియేట్ చేయడంతో ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయి. అలా సినిమాలకు దూరమై.. స్వగ్రామానికి వెళ్లిపోయారు ఐరన్ లెగ్ శాస్త్రి. అయితే అనారోగ్య సమస్యలతో చిన్నవయసులోనే కన్నుమూశారు.