
దర్శకుడు తేజ ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించారు తేజ.. చివరిగా ఆయన తెరకెక్కించిన అహింస సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గతంలో తేజ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి వారు డేట్లు ఇవ్వరని, కాబట్టి మీడియం లేదా చిన్న బడ్జెట్ చిత్రాలనే తాను ఎంచుకుంటానని చెప్పారు. మంచి కథ ఉంటేనే సినిమా తీస్తానని, పెద్ద హీరోల వెంట పడనని ఆయన స్పష్టం చేశారు. మహేష్ బాబుతో తీసిన ‘నిజం’ సినిమా గురించి ప్రస్తావించగా, ఆ సమయంలో మహేష్ బాబు బాబీ వంటి ఫ్లాప్‌లో ఉన్నారని, అందుకే ఆయనతో ఆ సినిమా చేయగలిగానని తేజ అన్నారు.
బి.ఏ. రాజుగారి చొరవతోనే నిజం సినిమా సెట్ అయ్యిందని, తాను ఎప్పుడూ అవకాశాల కోసం పెద్ద హీరోలను అడగనని, హిట్ లో ఉన్న స్టార్ల దగ్గరికి వెళ్ళనని అన్నారు. ప్రస్తుతం తనకు ప్రతి సినిమాలో కొంత షేర్ ఉంటుందని, ఒక మంచి హిట్ తర్వాత పూర్తిస్థాయి నిర్మాతగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తన ప్రయాణం దర్శకుడిగానే కాకుండా కథా రచయితగా కూడా కొనసాగుతుందని అన్నారు. కుటుంబ విషయాలపై మాట్లాడుతూ, తన కొడుకు సినీ రంగ ప్రవేశం చేయాలనుకుంటున్నాడని తేజ పేర్కొన్నారు. కొడుకు దర్శకత్వ కోర్సు పూర్తి చేసి అమెరికాలో శిక్షణ కూడా తీసుకున్నాడని, ప్రస్తుతం హీరోగా పరిచయం కావాలనే ఆసక్తి చూపిస్తున్నాడని తెలిపారు.
జె.డి. చక్రవర్తి తన ప్రేమకథ గురించి చెప్పిన విషయాలను తేజ ఖండించారు. జేడీ చక్రవర్తి చెప్పినవన్నీ సోది, అబద్ధాలు అని కొట్టిపారేశారు. తన పెళ్లిని అక్కినేని వెంకట్ గారు, జ్యోత్స్న అక్కినేని గారు నిశ్చయించారని తేజ స్పష్టం చేశారు. నాగేశ్వరరావు గారి కోడలు జ్యోత్స్న గారు తన పెళ్లి పెద్దగా వ్యవహరించారని, అలాగే తనను పెళ్లికొడుకు చేసింది వెంకట్ అక్కినేని గారి ఇంట్లోనే అని వివరించారు. హైదరాబాద్‌లోని కంట్రీ క్లబ్‌లో వివాహం జరిగిందని తెలిపారు. ఆ సమయంలో తనకు ఇల్లు, కారు ఏమీ లేవని, జ్యోత్స్న అక్కినేని గారు సలహా ఇవ్వగా, పెళ్లికి వారం రోజుల ముందు అద్దె ఫ్లాట్, ఐదు రోజుల ముందు కారు కొన్నానని తేజ గుర్తుచేసుకున్నారు. అప్పటికి తాను ‘రాత్రి’, ‘అంతం’ వంటి సినిమాలకు కెమెరామెన్‌గా పనిచేశానని, వర్మ క్రియేషన్స్ ఆఫీసులో, అన్నపూర్ణ స్టూడియోస్ కాటేజ్‌లలో నివసించేవాడినని తెలిపారు తేజ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.