పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)రీఎంట్రీ తర్వాత ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేస్తూ దూకుడు పెంచారు. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలతో హిట్స్ కొట్టిన పవన్. ఇప్పుడు హరిహరవీరమల్లుతో హ్యాట్రిక్ కు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించనున్నారు. మొగలాయిలా కాలం నాటి కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిధిఅగార్వల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా.. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు పవర్ స్టార్. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో యంగ్ డైరెక్టర్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ ఓకే చెప్పిన ఆ డైరెక్టర్ ఎవరో కాదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సాహూ సినిమా చేసిన సుజిత్. రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సుజిత్. తొలి సినిమాతో మంచి హిట్ అందుకున్న సుజిత్ ఆ వెంటనే ప్రభాస్ తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. సాహూ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యింది. మనదగ్గర కంటే బాలీవుడ్ లో ఈ సినిమా సంచలనం క్రియేట్ చేసింది. అక్కడ భారీ వసూళ్లు రాబట్టింది ఈ మూవీ. అయితే ఆ తర్వాత సుజిత్ కు మెగాస్టార్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. గాడ్ ఫాదర్ సినిమాను ముందు సుజిత్ తో చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చాల కాలంగా ఖాళీగా ఉన్న సుజిత్ ఓ రీమేక్ కథతో పవన్ తో సినిమా చేయనున్నాడని అంటున్నారు. తమిళ్ లో దళపతి విజయ్ నటించిన తేరి సినిమాను ఇప్పుడు రీమేక్ చేయనున్నారట. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేసే పనిలో ఉన్నాడట సుజిత్.