బస్సులో నుంచి దించేశారు.. భోజనం చేస్తుంటే అవమానించారు.. రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు

చిన్న సినిమాగా విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సంచలన విజయం సాధించింది. హీరో, హీరోయిన్లు, డైరెక్టర్ అందరూ కొత్త వారైనా ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది. నవంబర్ 21న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.

బస్సులో నుంచి దించేశారు.. భోజనం చేస్తుంటే అవమానించారు.. రాజు వెడ్స్ రాంబాయి దర్శకుడి కష్టాలు వింటే కన్నీళ్లు ఆగవు
Raju Weds Rambai Director S

Updated on: Nov 28, 2025 | 11:49 AM

నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఇలా రియల్ స్టోరీతో వచ్చిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా రాజు వెడ్స్ రాంబాయి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇల్లందు మండలంలో జరిగిన ఓ సంచలన ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సాయిలు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. ఈటీవీ విన్ ఒరిజినల్స్, డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్‌సూన్ టేల్స్ బ్యానర్లపై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ సినిమా నిర్మించారు. చిన్న సినిమాగా వచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో చిత్రయూనిట్ సంతోషంలో మునిగితేలుతున్నారు. కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకుంటారని మరోసారి రుజువైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే చిత్ర దర్శకుడు సాయిలు ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అని తెలిపాడు సాయిలు. సినిమా మీద ఇష్టంతో చాలా మంది దగ్గర పని చేశా అని తెలిపాడు. సంగీత దర్శకుడు చక్రి తనను ప్రోసహించాడని.. కానీ ఆయనను కలిసి నెల రోజుల్లోనే ఆయన చనిపోయారని దాంతో తాను మరోసారి అండ లేకుండా పోయిందని తెలిపాడు.

ఆతర్వాత శ్రీకాంత్ అడ్డాలను కలిశానని, అలాగే చివరిగా వేణు ఊడుగుల పరిచయం అయ్యారు అని తెలిపాడు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి ఎలాగైనా రావాలి అనుకున్నప్పుడు.. జూనియర్ ఆర్టిస్ట్ గా అయినా చేద్దామని అనుకున్నానని.. కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్ట్ లను తీసుకెళ్లడానికి ఓ బస్సు వస్తుంది.. దానిలో ఎక్కా.. కానీ బస్సు నిండిపోయింది. నువ్వు అవసరం లేదు అని దింపేశారు అని చెప్పాడు. అలాగే ఓ సినిమాకు పని చేస్తున్నప్పుడు భోజనం చేస్తుంటే.. ఆపి నీ కార్డు ఏది.? నువ్వు ఎవరు.? అని అడిగారని అప్పుడు చాలా అవమానంగా ఫీల్ అయ్యాను అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు సాయిలు. అన్ని కష్టాలు, అవమానాలు, రిజెక్షన్స్ చూసిన సాయిలు ఇప్పుడు తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.