ఈఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాల్లో విరూపాక్ష ఒకటి. సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదలైన బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి డైరెక్టర్ కార్తిక్ వర్మ దర్శకత్వం వహించారు. అయితే యాక్సిడెంట్ కారణంగా చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న సాయికి ఈ మూవీ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చింది. అలాగే గోల్డెన్ బ్యూటీ సంయుక్తమీనన్.. మరోసారి తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీని తెరకెక్కించడానికి కారణం.. సుమారు ఆరేళ్ల క్రితం పత్రికలో వచ్చిన ఓ నేర వార్తనే అన్నారు డైరెక్టర్ కార్తిక్. ఈ సినిమాకు నాంది పడింది కేవలం ఆ వార్త చదివాకే అన్నారు.
ఇటీవలే ఓ మీడియాతో ముచ్చటించిన కార్తీక్ మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి హారర్ సినిమాలంటే ఆసక్తి ఎక్కువ అని.. ఆ జోర్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా చేయాలనే ఆశతో ఉండేవాడినని తెలిపారు. 2016-17 సంవత్సరంలో పేపర్లో వచ్చిన ఓ క్రైమ్ వార్త తనను ఈ సినిమా రూపొందించేలా చేసిందన్నారు. “ఉత్తరాదిలోని ఓ ఊరిలో మహిళ.. తన భర్త చనిపోవడంతో ఆ ఊరి చివర నివస్తుండేది. అయితే అదే సమయంలో ఊర్లో ఇద్దరు పిల్లలు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. గ్రామస్తులందరూ ఆ మహిళను అనుమానించి అతి క్రూరంగా చంపేశారు. ఈ వార్త చదివిన తర్వాతే విరూపాక్ష రాయాలనిపించింది. నేను రాసిన కథలో పార్వతి (శ్యామల) విలన్. తల్లిదండ్రులు చనిపోయాక.. ఆమె ఆ ఊరు నుంచి పారిపోయి తిరిగి అదే గ్రామానికి కోడలిగా వచ్చి పగ తీర్చుకుంటుంది. కాకపోతే సుకుమార్ సర్.. దాన్ని మార్చి హీరోయిన్ ను విలన్ గా చూపించారు. కథానాయికకు అనుగుణంగా మార్పులు చేయాడనికి మాకు ఏడు నెలలు సమయం పట్టింది” అని అన్నారు. అలా ఈ సినిమాలో విలన్ మారినట్లు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. అదే స్థాయిలో ఓటీటీలోనూ రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, సోనియా సింగ్, రవికృష్ణ, శ్యామల కీలకపాత్రలలో కనిపించారు. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు.