
సినిమా సినిమాకీ గ్యాప్ తీసుకుంటూ మంచి కథలు తెరకెక్కిస్తూ విజయాలను అందుకుంటున్నారు దర్శకుడు హను రాఘవపూడి. అందాలరాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఈ సెన్సిబుల్ డైరెక్టర్.. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. అందాల రాక్షసి భారీ విజయాన్ని అందుకోకపోయిన అందరి మన్నలను అందుకుంది. మణిరత్నం స్టైల్ లో మేకింగ్ ఉంది అంటూ హను పై ప్రశంసలు కురిపించారు. ఆతర్వాత పడిపడిలేచే మనసు, లై, కృష్ణగాడి వీరప్రేమ గాద సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ తో కలిసి సీతా రామం అనే క్లాసిక్ సినిమాను తెరకెక్కించారు. సీతారామం సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
దాంతో హను రాఘవపూడి పేరు మారుమ్రోగింది. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు హను రాఘవపూడి. మొన్నామధ్య ఈ సినిమా పూజాకార్యక్రమాలు కూడా జరిగాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హను కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, ఇంతవరకు చూడని అద్భుతమైన కథాంశంతో ఉంటుందని అన్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో చేస్తున్నా కాబట్టి అభిమానుల అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా కథ ప్రభాస్ కోసమే ప్రత్యేకంగా రాసిందని తెలిపారు. దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ కథ కోసం శ్రమించానని, సీతారామం తర్వాత ఈ స్క్రిప్ట్‌పైనే పూర్తి దృష్టి సారించినట్లు ఆయన వివరించారు.
ఈ చిత్రంలో నాయికగా ఇమాన్విని ఎంపిక చేయడంపైనా హను రాఘవపూడి మాట్లాడారు. ఇమాన్విని తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశానని, ఆమె అద్భుతమైన క్లాసికల్ డ్యాన్సర్ అని తెలిపారు. ఆమె నటనపై ఆసక్తి చూపడం, పాత్రకు ఆమె సరిపోవడం తో ఆమెను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమె తెలుగు నేర్చుకోవడంతో పాటు, నటనలో అద్భుతంగా రాణిస్తోందని ప్రశంసించారు. ప్రభాస్ లుక్, క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.. అన్నీ సర్‌ప్రైజ్‌లే అని ఆయన సమాధానం ఇచ్చారు. ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనంతగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఏ దర్శకుడికైనా ప్రభాస్‌తో పనిచేయడం ఒక ఆనందకరమైన విషయమని, అది తనకు కాస్త ముందుగానే లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సీతారామం ఈవెంట్‌కు ప్రభాస్ గెస్ట్‌గా రావడం, ఆ తర్వాత రవితో కలిసి ప్రభాస్ గారితో ఈ కథను చర్చించి, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..