యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే కల్కి 2898 ఏడీ మూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొట్టాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు డార్లింగ్ చేయబోయే ప్రాజెక్ట్స్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. ఓవైపు డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో రాజాసాబ్ షూటింగ్ జరుగుతుండగానే మరో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు ప్రభాస్. సీతారామంలాంటి అద్భుతమైన లవ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా చేయనున్నాడు. కొద్దిరోజుల క్రితం ఈ మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. అయితే ఇందులో టాలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాకుండా సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయిన ఇమాన్వీ ఇస్మాయిల్ అనే అమ్మాయిని కథానాయికగా పరిచయం చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమా పూజా కార్యక్రమాలలో ఇమాన్వీని చూసి నెటిజన్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇన్ స్టాలో రీల్స్ చేసే అమ్మాయి ఏకంగా ప్రభాస్ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందని తెలిసి.. ఆ బ్యాగ్రౌండ్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ మూవీ అనౌన్స్మెంట్ తర్వాత ఇమాన్వీకి నెట్టింట ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వీని ఎంచుకోవడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ హను రాఘవపూడి క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియా వల్ల కొత్త టాలెంట్.. ప్రతిభ ఉన్నవారిని వెతికి పట్టుకోవడం చాలా సులభమైందన్నారు. “ప్రస్తుత రోజుల్లో కొత్త టాలెంట్ వెలికితీయడంలో సోషల్ మీడియాలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా కథకు అనుగుణంగా నటీనటులను ఎంపిక చేసుకోవడానికి దర్శకనిర్మాతలకు చాలా ఉపయోగపడుతుంది. అందం, అంతకు మించిన ప్రతిభ ఉన్న అమ్మాయి ఇమాన్వీ. ఆ అమ్మాయి భరతనాట్యం డ్యాన్సర్. ఇప్పటివరకు ఇన్ స్టాలో ఆమె డాన్స్ వీడియోస్ చూస్తుంటాను. కళ్లతోనే ఎన్నో హావభావాలను పలికిస్తుంది. అందుకే ఆమెకు ఒక అవకాశం ఇవ్వాలనుకున్నాను. ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్ తర్వాతే ఆమెను సెలక్ట్ చేశాను. కానీ ఇమాన్వీని ఎంపిక చేయడం నా ఒక్కడి నిర్ణయం కాదు.. మొత్తం చిత్రయూనిట్ నిర్ణయం” అంటూ చెప్పకొచ్చారు.
ప్రస్తుతం హను రాఘవపూడి చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్, హను కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఫౌజీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే..ప్రస్తుతం ఇమాన్వీకి ఇన్ స్టాలో 7 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.