మాలీవుడ్: క్లాసిక్ చిత్రాలకే కాదు.. కామ పిశాచులకు కేరాఫ్ అడ్రస్..!

Hema Commission Report: మలయాళ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ దుమారం నేపథ్యంలో నటీమణులతో పాటు ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్‌ హేమ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిషన్ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎప్పుడో నివేదిక సమర్పించగా.. ఇప్పుడు ఇందులోని అంశాలు వెలుగుచూశాయి. నివేదికలోని అంశాలు మలయాళ చిత్రపరిశ్రమను షేక్ చేస్తోంది.

మాలీవుడ్: క్లాసిక్ చిత్రాలకే కాదు.. కామ పిశాచులకు కేరాఫ్ అడ్రస్..!
Malayalam Film Industry
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 21, 2024 | 4:36 PM

మలయాళ చిత్రపరిశ్రమ మాలీ‌వుడ్‌లో మదనకామరాజులు చెలరేగిపోతున్నారు. సినిమా అవకాశాల కోసం వచ్చే మహిళలపై లైంగిక దాడులు అక్కడ సర్వసాధారణమైపోయాయి. ఇలాంటివి వాటికి సర్దుకుపోయి, రాజీపడితేనే మాలీవుడ్‌లో మహిళలకు మనుగడ సాధ్యం.. లేదంటే వాళ్ల సినిమా జీవితానికి ఇక ఎండ్ కార్డ్ పడిపోయినట్టే. సర్దుకుపోయేవారికి సెపరేట్‌ కోడ్‌ నేమ్స్‌, తిరగబడిన వారిపై అప్రకటిత నిషేధం ఖాయం. ఇవన్నీ మాలీవుడ్‌లో మదనకామరాజుల బాగోతంపై వెలుగు చూసిన జస్టిస్ హేమ కమిషన్ నివేదికలోని కీలక విషయాలు. మలయాళ చిత్ర పరిశ్రమను ఇప్పుడీ సంచలన నివేదిక వణికిస్తోంది. ఈ నివేదిక చదువుతూ పోతే సామాన్యులు తల్లడిల్లాల్సిందే. అనేక సంచలన విషయాలు అందులో ఉన్నాయి. మలయాళ చిత్రసీమలో మహిళలు తీవ్ర లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు ఈ కమిషన్ నివేదిక తేల్చింది. ఈ నివేదిక మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక్కటే కాదు.. భారత ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది.

మలయాళ సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ దుమారం నేపథ్యంలో నటీమణులతో పాటు ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్‌ హేమ కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిషన్ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఎప్పుడో నివేదిక సమర్పించగా.. ఇప్పుడు ఇందులోని అంశాలు వెలుగుచూశాయి. నివేదికలోని అంశాలు మలయాళ చిత్రపరిశ్రమను షేక్ చేస్తోంది. 295 పేజీల సుదీర్ఘ నివేదికలో జస్టిస్‌ హేమ కమిటీ అనేక విషయాలు ప్రస్తావించింది. మహిళలపై లైంగిక వేధింపులు, శ్రమదోపిడి, అసభ్య ప్రవర్తన వంటివి మల్లువుడ్‌లో సాధారణమయ్యాయని ఈ కమిటీ స్పష్టం చేసింది. రేప్ బెదిరింపులు, సెక్సీ కామెంట్స్ సహా మహిళలపై ఏకంగా 17 రకాలుగా వేధింపులు జరుగుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది. క్రిమినల్‌ గ్యాంగ్స్‌ కనుసన్నల్లో మలయాళ చిత్రపరిశ్రమ నడుస్తోందని తన సుదీర్ఘ నివేదికలో కమిటీ వెల్లడించింది. పలువురు సాక్షులు తెలిపిన వివరాలను క్రోడీకరించి రూపొందించి ఎన్నో సంచలన అంశాలను ఈ నివేదికలో పొందుపర్చారు. ఈ కమిటీ నివేదికను నాలుగేళ్ల క్రితమే సమర్పించినా అది ఇంత వరకు వెలుగుచూడలేదు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ నివేదిక బయటకు వచ్చింది.

Hema Commission Report

Hema Commission Report

పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం పోష్‌ చట్టం ఉన్నా అది సినిమా పరిశ్రమకు ఏ మాత్రం సాయపడేలా లేదని కమిటీ అభిప్రాయపడింది. మాలీవుడ్‌లోని కీలక వ్యక్తుల కారణంగా ఆ చట్టం నిరర్థకంగా నిలుస్తోందని జస్టిస్‌ హేమ కమిటీ తెలిపింది. 2017లో మలయాళ నటి భావనపై లైంగిక దాడి జరిగింది. కారులో ఆమెను తిప్పుతూ దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడని మలయాళ హీరో దిలీప్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అతన్ని అరెస్టు చేశారు. ఈ లైంగిక దాడి వ్యవహారంలో కేరళవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో విజయన్‌ సర్కారు జస్టిస్‌ హేమ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యురాలిగా సీనియర్‌ నటి శారద, రిటైర్డ్‌ IAS అధికారి వల్సల కుమారి ఉన్నారు. అనేక అంశాలు ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంది. 295 పేజీల నివేదికలో కమిటీ సభ్యులు ఎవరికి వారు తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ బయటి నుంచి మాత్రమే వెలుగులతో కనిపిస్తుందని, లోపలి మాత్రం చీకటి, నల్లని మబ్బులు, సంక్షోభమేనని జస్టిస్‌ హేమ ‌ నివేదిక మొదటి లైన్లలోనే రాశారు.

రాజకీయ దుమారంరేపిన నివేదిక

జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక ఇప్పుడు వెలుగుచూడటంతో కేరళవ్యాప్తంగా అది సంచలనంగా మారింది. మహిళలను ఎందుకు వేరుగా చూడాలని కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో కేవలం చట్టాలతో సమస్య పరిష్కారం కాదని, సామాజిక అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జస్టిస్‌ హేమ కమిషన్‌ నివేదికపై కేరళ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం రాజకీయంగానూ కలకలం సృష్టిస్తోంది. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోకపోతే మరో తరం మహిళలు కూడా బాధలు పడాల్సి వస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రతిష్ఠలున్న మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలకు అసురక్షిత వాతావరణం ఉండటంపై శశిథరూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. జస్టిస్‌ హేమ కమిషన్‌ నివేదికపై సమగ్ర విచారణ జరగాలని, దోషులు ఎంతటివారైనా కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

Justice Hema Commission

Justice Hema Commission

మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై జస్టిస్‌ హేమ కమిషన్‌ నివేదిక అనేక విషయాలు బయటపెట్టింది. షూటింగ్ సమయంలో మహిళలకు మరుగుదొడ్డి సదుపాయం కూడా అందుబాటులో ఉండదని కమిషన్‌ నివేదిక వెల్లడించింది. దుస్తులు మార్చుకునేందుకు సరైన గదులూ ఉండవని తెలిపింది. సినిమాల్లో అవకాశాల కోసం తమను కలిసే మహిళలను ప్రొడక్షన్ మేనేజర్లు లొంగదీసుకుంటున్నారని స్పష్టం చేసింది. పరిస్థితులను బట్టి సర్దుకుపోండి, కొన్ని విషయాల్లో రాజీపడండి, అలాగైతేనే మీకు సినిమాల్లో అవకాశం ఉంటుందని ఆంక్షలు పెట్టడం మలయాళ చిత్రపరిశ్రమలో సాధారణమైపోయిందని జస్టిస్‌ హేమ కమిషన్ తెలిపింది. సర్దుకుపోవడం, రాజీపడటం అన్నది మాలీవుడ్‌లో చాలా ప్రముఖ పదాలని నివేదిక పేర్కొంది. అవి ఎవరైతే అనుసరిస్తారో వారికి మాత్రమే సినిమాల్లో అవకాశాలు దక్కుతాయని తెలిపింది. అంగీకరించిన మహిళలకు కోడ్‌ నేమ్‌ పెడతారనే విషయం కూడా కమిషన్‌ విచారణలో వెలుగు చూసింది.

స్టార్‌డమ్ పెరిగే కొద్దీ వేధింపులు ఎక్కువే..

షూటింగ్ సమయంలో తమకు కేటాయించిన వసతి గృహాల్లో ఒంటరిగా ఉండాలంటే మహిళలు భయపడే పరిస్థితి ఉందని కూడా కమిటీ నివేదిక తెలిపింది. ఎప్పుడు ఎవరు తాగి వచ్చి తలుపుకొడతారో అనే భయంతో స్నేహితులను, బంధువులను మహిళలు వెంట తెచ్చుకునే పరిస్థితి ఉందని జస్టిస్‌ హేమ కమిషన్‌ నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులకు గురయ్యే హీరోయిన్లు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకురాని పరిస్థితి కూడా మాలీవుడ్‌లో ఉంది. తమతో పాటు కుటుంబసభ్యులు కూడా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందనే భయంతో చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. వాస్తవానికి ఇండస్ట్రీలో నటీమణులకు స్టార్‌డమ్ పెరిగే కొద్ది వేధింపులు ఎక్కువ అవుతాయని జస్టిస్ హేమ కమిటీ ఆ నివేదికలో వెల్లడించింది.

పలుకుబడిన ఉన్న నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, ప్రొడక్షన్‌ కంట్రోలర్స్‌ లాంటి శక్తిమంతమైన వ్యక్తులు మాలీవుడ్‌ను పూర్తిగా తమ అధీనంలో ఉంచుకున్నారని కూడా నివేదిక తెలిపింది. ఫిర్యాదులు చేస్తే తమ పలుకుబడి ఉపయోగించి వారు తమకు సినిమాల్లో అవకాశం రాకుండా చేస్తారని చాలా మంది మహిళలు భయపడుతున్న పరిస్థితి ఉందని నివేదిక తేల్చి చెప్పింది. ఫిర్యాదు చేసిన వారిపై అప్రకటిత నిషేధం ఉంటుందని, వాళ్లకు ఇక వేరే సినిమాల్లోనూ అవకాశాలు రావని వెల్లడించింది. పెద్ద హీరరోయిన్లకు తప్ప మిగిలిన నటీనటులకు రెమ్యూనరేషన్‌కు సంబంధించి ఎలాంటి రాతపూర్వక ఒప్పందాలూ ఉండవు. దీని వల్ల మహిళలు, జూనియర్‌ ఆర్టిస్టులకు పూర్తిగా పారితోషికం అందదని కూడా జస్టిస్‌ హేమ కమిషన్‌ నివేదిక తేటతెల్లం చేసింది.

Malayalam film industry

Representative Image

జస్టిస్ హేమ కమిషన్ నివేదికపై విమర్శలు..

జస్టిస్ హేమ కమిషన్ నివేదికను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టే ముందు అందులో 63 పేజీలు తొలగించడం, మార్చడం వంటివి జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పేజీలు ఎందుకు తొలగించారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ఈ నివేదిక అసమగ్రమైందంటూ ప్రముఖ మలయాళ రచయిత సారా జోసఫ్ పెదవి విరిచారు. ఇండస్ట్రీలో అకృత్యాలు జరుగుతున్నట్లు వెల్లడించిన నివేదిక.. నిందితులు ఎవరి పేర్లనూ ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. మాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఎవరు బాధ్యులన్న విషయంలో జస్టిస్ హేమా కమిషన్ స్పష్టత ఇవ్వలేకపోయిందన్నారు. ఇప్పటి వరకు అందరికీ తెలిసిన అంశాలనే ఆ నివేదికలో వెల్లడించారని అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో డబ్బు, మద్యం, డ్రగ్స్, సెక్స్ ప్రభావం అందరికీ తెలిసిందే అన్నారు. ఇండస్ట్రీలో మాఫియా ముఠాలు నడుపుతున్న నిందితులు పేర్లను చెప్పనది వారిపై కేరళా ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు చర్యలు తీసుకోలేవని అన్నారు.

అటు సినీ నటి తనుశ్రీ దత్త కూడా జస్టిస్ హేమ కమిషన్ నివేదికతో ఒరిగేదేమీ లేదంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. 2017లో జరిగిన వేధింపులకు సంబంధించి కమిషన్ ఏర్పాటు చేయగా.. ఏడేళ్ల తర్వాత నివేదికలోని అంశాలు బయటకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కమిటీలు, నివేదికలు తనకు అర్థంకావని.. అవన్నీ నిరుపయోగాలుగా ఎద్దేవా చేశారు. 2018 నాటి మీ టూ ఉద్యమంలో తనుశ్రీ దత్త కీలక పాత్ర పోషించడం తెలిసిందే. అప్పట్లో ఆమె బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌ తనను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు సంచలన ఆరోపణలు చేశారు.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి