యంగ్ హీరో నితిన్ పై డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ (Amma Rajashekar) అసహనం వ్యక్తం చేశారు. నితిన్ (Nithiin) తనను అవమానించారని.. అతని ప్రవర్తన తనను బాధపెట్టిందంటూ అంటూ మండిపడ్డారు. తాను దర్శకత్వం వహించిన హై ఫైవ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అమ్మ రాజశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత అమ్మ రాజశేఖర్ మెగా ఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ హైఫైవ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో నితిన్ రావాల్సి ఉంది. కానీ ఆయన వక్తిగత కారణాలతో ఈ వేడుకకు రాలేదు. దీంతో అమ్మ రాజశేఖర్ నితిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
” హై ఫైవ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నితిన్ ముఖ్య అతిథిగా రావాలని అతడిన పది రోజుల ముందే ఆహ్వానించాను. వస్తాను అని చెప్పడంతో నమ్మి.. అన్నం కూడా తినకుండా దగ్గరుండి ప్రత్యేకంగా ఏవీ కూడా క్రియేట్ చేయించాను. అసలు నితిన్ కు డాన్సే రాదు. డాన్స్ నేర్పించి ఓ గుర్తింపు వచ్చేలా చేసిన గురువులాంటి నాపై గౌరవంతో వస్తారని భావించాను. కానీ ఆయన ఇంట్లో ఉండి కూడా ఇక్కడికి రాలేదు. ఫోన్ చేస్తే జ్వరమని చెప్పారు. అందుకు కనీసం ఒక వీడియో బైట్ పంపమని అడిగాను. అదీ కూడా ఇవ్వలేదు. ప్రస్తుతం నేను కేవలం ఓ విషయం మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. జీవితంలో మనం ఏ స్థాయిలో ఉన్నా.. అందుకు సాయపడిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. నితిన్ రాలేను అనుకుంటే రాను అని నేరుగా చెప్పేయాల్సింది. వస్తానని చెప్పి రాకుండా నన్ను ఎంతో అవమానించావ్. నాకు చాలా బాధగా ఉంది.” అంటూ అమ్మ రాజశేఖర్ ఎమోషనల్ అయ్యారు. నితిన్, అమ్మ రాజశేఖర్ కాంబోలో టక్కరి సినిమా వచ్చింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నితిన్ మాచెర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తున్నారు. పొలిటికల్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో నితిన్ ఐఏఎస్ పాత్రలో కనిపించనున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి