
రణ్ వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన నెలన్నర రోజులు గడిచినా, థియేటర్లలో ఇప్పటికీ మూవీకి మంచి స్పందన వస్తోంది. ‘ధురంధర్’ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1300 కోట్ల భారీ వసూళ్లను సాధించింది. ఇందులో రణవీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, సారా అర్జున్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘ధురంధర్’ క్లైమాక్స్ లో ఈ చిత్రం రెండవ భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు సీక్వెల్ తేదీని కూడా ప్రకటించారు. రెండవ భాగం ‘ధురంధర్: ది రివెంజ్’ మార్చి 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పుడీ క్రేజీ సీక్వెల్ టీజర్ గురించి ఒక ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది.
దర్శకుడు ఆదిత్య ధర్ ప్రేక్షకుల నాడిని బాగా తెలుసుకున్నాడు. అందువల్ల, ప్రేక్షకుల నుంచి ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ రాకుండ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ టీజర్‌ను మొదటి పార్ట్ కంటే మరింత పవర్ ఫుల్ గా రూపొందించాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి A సర్టిఫికేట్ లభించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) జనవరి 19న ఈ టీజర్‌ను ఆమోదించి A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ టీజర్ వ్యవధి దాదాపు 1 నిమిషం 48 సెకన్లు. మొదటి పార్ట్ కు మించి ‘ధురంధర్ 2: ది రివెంజ్’ టీజర్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలు చూపించనున్నారని టాక్. ‘ధురంధర్ 2: ది రివెంజ్’ టీజర్‌ను సన్నీ డియోల్ ‘బోర్డర్ 2’ సినిమా థియేటర్లలో విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. అంటే, బోర్డర్ 2 సినిమా చూడటానికి థియేటర్‌కు వెళ్లే ప్రేక్షకులు, విరామం సమయంలో లేదా ప్రారంభంలో ధురంధర్ 2 టీజర్‌ను చూసే అవకాశం ఉంటుంది. బోర్డర్ సినిమా శుక్రవారం (జనవరి 23) ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాందహార్ విమానం హైజాక్, 2001 పార్లమెంటు దాడి, 26/11 ముంబై దాడుల తర్వాత నిఘా సంస్థల కార్యకలాపాల కథ ఆధారంగా ధురంధర్ సినిమాను నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన ఈ మూవీపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి