
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్, తన కెరీర్‌లో సాధించిన విజయాల వెనుక ఉన్న కష్టం అలాగే సాంగ్స్ కోసం ఆయన చేసే ప్రయోగాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ముఖ్యంగా, ఉదయ్ కిరణ్ నటించిన కలుసుకోవాలని సినిమాలో ఉదయించిన సూర్యుడిని పాట తన అభిమానులకు చాలా ఇష్టమైన పాట అని, ఈ పాటను తాను అనూహ్య పరిస్థితుల్లో కేవలం అరగంటలో రాసి, కంపోజ్ చేసినట్లు తెలిపారు. కలుసుకోవాలని సినిమా కోసం దేవి శ్రీ ప్రసాద్ ఆకాశం తన రెక్కలతో అలాగే ఉదయించిన సూర్యుడిని అనే రెండు పాటలకు సాహిత్యాన్ని అందించారు. ఆకాశం తన రెక్కలతో పాట రాసిన తర్వాత, ఆయన తల్లి “ఒక అమ్మాయిలాగే ఫీల్ అయ్యి రాసావు. నా పెళ్లి అవ్వకముందు నాకు కూడా ఇలాగే ఉండేది” అని ప్రశంసించారని, అలాగే ఆయన తండ్రి కూడా ఎంతగానో మెచ్చుకున్నారని గుర్తు చేసుకున్నారు.
ఉదయించిన సూర్యుడిని పాట విషయానికొస్తే, సినిమా ఆడియో విడుదల చేయడానికి కొద్ది సమయం ముందు, ఒక ట్యూన్‌కు లిరిక్స్ రాకపోవడంతో ఒత్తిడికి గురై, మిక్సింగ్ స్టూడియోలోనే పేపర్, పెన్నుతో ఆ పాటను రాస్తూ, పాడూతూ పూర్తి చేశానని డీఎస్పీ వివరించారు. అలా తక్కువ సమయంలో సృష్టించిన పాటలు కూడా అద్భుతాలు సృష్టిస్తాయని దీని ద్వారా రుజువైందని ఆయన పేర్కొన్నారు. దేవి శ్రీ ప్రసాద్ తన సంగీతం అలాగే పాటల గురించి వివరిస్తూ, పాటలు ఎల్లప్పుడూ సినిమా ఎమోషన్ ఆధారంగా ఉంటాయని తెలిపారు.
తాను ఎప్పుడూ రెండు విధాలుగా పాటలను ప్లాన్ చేస్తానని అన్నారు. మొదటిది, సినిమా చూస్తున్నప్పుడు ఆ పాట కథకు సంపూర్ణంగా కనెక్ట్ అవ్వాలి. రెండవది, సినిమాతో సంబంధం లేకుండా విన్నప్పుడు కూడా అది సూపర్ హిట్ అయ్యేలా ఉండాలి. కథను నడిపించాల్సిన అవసరం లేని పాటలకు, వీలైనంత జెనరిక్‌గా, కావ్యాల లాగ ఉండే సాహిత్యాన్ని ఇష్టపడతానని ఆయన అన్నారు. అయితే, ఆర్యలోని ఆకాశం తాకేలా వంటి పాటలు మాత్రం కథను వివరించే సిట్యువేషనల్ సాంగ్స్ అని, అలాంటి సందర్భాల్లో కథకు అనుగుణంగా సాహిత్యం ఉంటుందని తెలిపారు దేవీ శ్రీ ప్రసాద్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి