Tollywood: ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేశారు.. బన్నీకి బ్లాక్‌బస్టర్.. నందమూరి హీరోకి అట్టర్ ప్లాప్

వేణు, సుమంత్ రిజెక్ట్ చేసిన దేశముదురు చిత్రాన్ని అల్లు అర్జున్ అంగీకరించి ఘన విజయం సాధించారు. బన్నీ వదులుకున్న తమిళ శివకాశి రీమేక్ విజయదశమిని నందమూరి కళ్యాణ్ రామ్ చేసి అపజయం చవిచూశారు. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి.

Tollywood: ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేశారు.. బన్నీకి బ్లాక్‌బస్టర్.. నందమూరి హీరోకి అట్టర్ ప్లాప్
Allu Arjun

Updated on: Apr 14, 2026 | 10:11 AM

అల్లు అర్జున్ సినీ కెరీర్‌లో ‘దేశముదురు’ ఒక మైలురాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బన్నీని మాస్ హీరోగా నిలబెట్టడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను సృష్టించింది. అయితే ఈ సినిమా వెనుక పలు ఆసక్తికర విషయాలు ఉన్నాయి. దర్శకుడు పూరి జగన్నాథ్ మొదట ఈ ‘సన్యాసిని ప్రేమికుడు’ అనే కథను వేణు తొట్టెంపూడికి, ఆ తర్వాత సుమంత్‌కు వినిపించారు. అయితే, ఒక సన్యాసిని పాత్రతో రొమాన్స్ అనే అంశంపై వారికి నమ్మకం లేకపోవడంతో ఆ కథను తిరస్కరించారు. కానీ, అల్లు అర్జున్ ఈ కథలోని వైవిధ్యాన్ని గుర్తించి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బన్నీ కాకుండా వేరే హీరో చేసి ఉంటే ఆ చిత్రం అంతటి విజయం సాధించేది కాదని సినీ వర్గాల అభిప్రాయం. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు. తెలుగులో తొలిసారిగా సిక్స్ ప్యాక్ బాడీని పెంచి, తన అద్భుతమైన మేకోవర్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. పూరి జగన్నాథ్ మార్కు మాస్ డైలాగులు, చక్రి అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా “సత్తే గొడవ లేదు”, “అట్టాంటోడే ఇట్టాంటోడే” లాంటి పాటలు అప్పట్లో ఊపు ఊపేశాయి.

2007 సంక్రాంతి బరిలో ప్రభాస్ నటించిన ‘యోగి’ లాంటి భారీ అంచనాలున్న సినిమా పోటీగా ఉన్నప్పటికీ, ‘దేశముదురు’ తిరుగులేని విజయాన్ని సాధించింది. సుమారు 500 స్క్రీన్లలో విడుదలై, మొదటి వారంలోనే రూ. 12 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అప్పట్లో కేరళలో కూడా ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేయగా, అక్కడ అల్లు అర్జున్‌కు భారీ క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తమిళ చిత్రం ‘శివకాశి’ రీమేక్(తెలుగులో విజయదశమి)ను వదులుకున్నారు. బన్నీ వదులుకున్న ఆ సినిమాను కళ్యాణ్ రామ్ చేయగా, అది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. మరోవైపు, ఇతరులు వదులుకున్న ‘దేశముదురు’ బన్నీకి కెరీర్ బెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ విధంగా ‘దేశముదురు’ చిత్రం అల్లు అర్జున్‌ను మాస్ ఆడియన్స్‌కు దగ్గర చేసి, ఆయనను నేటి ‘పుష్ప’ వంటి పాన్ ఇండియా స్థాయి హీరోగా ఎదగడానికి బలమైన పునాది వేసింది.

ఇది చదవండి: రిలీజ్‌కు డబ్బుల్లేక మూలాన పడేశారు.. కట్ చేస్తే.. 3 ఏళ్లకు బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్..

Follow Us