AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రిలీజ్‌కు డబ్బుల్లేక మూలాన పడేశారు.. కట్ చేస్తే.. 3 ఏళ్లకు బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్..

రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన మనీ సినిమా ఆర్థిక ఇబ్బందులు, కీలక నటుల మార్పులు, మూడేళ్ల ఆలస్యంతో విడుదలైంది. బ్రహ్మానందం ఖాన్ దాదా పాత్ర విషయంలోనూ సమస్య ఎదురైంది. ఎనిమిది కేంద్రాల్లో 100 రోజులు ఆడి, నంది అవార్డులు గెలుచుకుని, తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయింది.

Tollywood: రిలీజ్‌కు డబ్బుల్లేక మూలాన పడేశారు.. కట్ చేస్తే.. 3 ఏళ్లకు బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్..
Tollywood
Ravi Kiran
|

Updated on: Apr 13, 2026 | 9:23 AM

Share

టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా నిలిచింది ‘మనీ’ చిత్రం. అయితే ఈ మూవీ విడుదలకు ముందు జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలు ఇప్పటికీ ఎవరికి తెలియదు. రామ్‌గోపాల్ వర్మ నిర్మాణంలో శివనాగేశ్వరరావు తొలిసారిగా దర్శకత్వం వహించిన చిత్రం ‘మనీ’. హాలీవుడ్ చిత్రం ‘రూత్‌లెస్ పీపుల్’ ఆధారంగా, మన నేటివిటీకి తగ్గట్టుగా నిరుద్యోగం, ఆకలి లాంటి అంశాలను జోడించి ఈ స్క్రిప్ట్‌ను రూపొందించారు. అక్కినేని వెంకట్ సూచించిన ‘అదర్ పీపుల్స్ మనీ’ అనే పదం నుంచి వర్మకు ‘మనీ’ అనే టైటిల్ నచ్చింది.

హీరోగా జేడీ చక్రవర్తిని ఎంపిక చేయగా.. ఈ సినిమా ఆయనకు హీరో ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. జయసుధ పక్కన నటించే పాత్ర కోసం మొదట ఎస్.పి. బాలు, దాసరి నారాయణరావు లాంటి పేర్లు వినిపించినా, చివరికి పరేష్ రావల్‌ను ఎంపిక చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి తప్పుకోవడంతో ఆయన అసిస్టెంట్ శ్రీమూర్తిని పరిచయం చేశారు. ఛాయాగ్రాహకుడిగా తేజ కొంత భాగం పని చేయగా.. ఆ తర్వాత చోటా కె. నాయుడు, రమణరాజు పూర్తి చేశారు. సినిమా షూటింగ్ పూర్తయ్యాక నిడివి తక్కువగా ఉండటంతో(కేవలం 9,000 అడుగులు), సెన్సార్ నిబంధనల కోసం అదనంగా 2,500 అడుగుల నిడివి అవసరమైంది. ఈ సమస్యను అధిగమించడానికి బ్రహ్మానందం పోషించిన ‘ఖాన్ దాదా’ పాత్రను సృష్టించారు.

కేవలం రెండు రోజుల్లోనే ఈ పాత్ర చిత్రీకరణ పూర్తయింది. “వారెవ్వా ఏమి ఫేసు!”పాటను అప్పటికప్పుడు ట్యూన్ చేసి చిత్రీకరించారు. “ఖాన్ తో గేమ్స్ వద్దు”, “సాల్తీలు లేచిపోతాయి” లాంటి డైలాగులు ఇప్పటికీ పేలుతుంటాయి. ఈ పాత్రకు గానూ బ్రహ్మానందానికి నంది అవార్డు లభించింది. అటు ఆర్థిక ఇబ్బందులు, సాంకేతిక మార్పుల వల్ల మూడేళ్ల పాటు ఈ సినిమా ల్యాబ్‌లోనే ఉండిపోయింది. చివరకు 1993 జూలై 11న విడుదలైన ‘మనీ’ అద్భుత విజయాన్ని అందుకుంది. మొదటి రన్‌లోనే దాదాపు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఎనిమిది కేంద్రాలలో 100 రోజులు, హైదరాబాద్ ఓడియన్ థియేటర్‌లో 130 రోజులు ప్రదర్శితమైంది. ఈ చిత్రం పలు నంది అవార్డులను కైవసం చేసుకుంది. అనేక అడ్డంకులను అధిగమించి విడుదలైన ‘మనీ’ చిత్రం, తెలుగులో ఒక కల్ట్ క్లాసిక్ కామెడీగా నిలిచిపోయింది. బ్రహ్మానందం అద్భుత నటనకు మెచ్చిన వర్మ, ఆయనకు ఒక మారుతీ సుజుకి కారును బహుమతిగా ఇవ్వడం విశేషం.

ఇది చదవండి: మొద్దు శీను జైలు నుంచి ఆ లెటర్‌లో నాకు ఏం రాసాడంటే.. అప్పుడే చెప్పిన గొల్లపూడి

Follow Us