సినిమా తియ్యడం అంటే పులి మీద సవారీ లాంటిది. పైకి గంభీరంగా నిమ్మళంగా కనిపిస్తున్నా ఆ పెయిన్ ఏంటో ఆ ప్రొడ్యూసర్ కి మాత్రమే తెలుసు. ఇప్పుడు కరోనా టైములో సగటు సినిమా ప్రొడ్యూసర్ కష్టాలు రెట్టింపయ్యాయి. కక్కలేక మింగలేక అగచాట్లు పడే నిర్మాతల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో పరిస్థితి. వరసబెట్టి రెండు సార్లు దెబ్బ కొట్టిన కోవిడ్ తో ఇండస్ట్రీ కుదేలైన మాట వాస్తవం. ఓవరాల్ గా పరిశ్రమకు ఎంత మేర గండి పడిందన్న లెక్క ఎప్పటికప్పుడు మారుతూనే వుంది. గత ఏడాది ఏడునెలల గ్యాప్ తోనే వెయ్యి కోట్లు నష్టపోయినట్టు తేల్చారు. సడన్ గా ముంచుకొచ్చిన సెకండ్ వేవ్ ఇంకెంత లోతుకు ముంచిందో తేలాల్సి వుంది. ఇండస్ట్రీ నష్టం ఎంతన్న కాలిక్యులేషన్స్ అలా ఉంటే… యావరేజ్ గా ఒక్కో ప్రొడ్యూసర్ మీద 25 శాతం ఎక్స్ ట్రా బర్డెన్ పడిందన్నది ఒక చేదు నిజం.
సొంత డబ్బు మాత్రమే పెట్టి సినిమా తీసే నిర్మాతలు మన దగ్గర చాలా తక్కువ. ఫైనాన్స్ లో డబ్బు తీసుకొచ్చి.. సినిమాకు ఇన్వెస్ట్ చేసే పద్ధతిలోనే మేజర్ పార్ట్ అఫ్ ప్రొడక్షన్ షురూ అయ్యేది. ఈ క్రమంలో డిమాండ్ ని బట్టి, టైం పీరియడ్ ని బట్టి వడ్డీ శాతం 10 రూపాయల దాకా ఉంటుంది. ఈ లెక్కన సినిమా రిలీజ్ నెలరోజులు వాయిదా పడితే.. అదనంగా పడే భారం ఎంత? ఫైనల్ కాపీ రెడీ చేసుకుని కూడా దాదాపు ఏడాది పాటు రిలీజ్ ని ఆపుకున్న ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నీ పరిశ్రమ భవిష్యత్తును కూడా నిర్దేశించేవే. కొన్ని పెద్ద సినిమాల ప్రొడ్యూసర్లు తమ పెట్టుబడిలో సగానికి పైగా డబ్బు బైటనుంచే తెచ్చుకున్నారన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఇప్పుడు బిగ్ సైజ్ ప్రాజెక్టులు టేకప్ చేసిన భారీ బేనర్లు కూడా ఇలాగే మొండి ధైర్యంతోనే ముందుకెళ్తున్నారు. విడుదల తేదీ వాయిదా పడేకొద్దీ… ఇటువంటి పెద్ద సినిమాల మీద ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది. ఇక స్మాల్ అండ్ మిడిల్ రేంజ్ సినిమాల సిట్యువేషన్ వర్ణనాతీతం. ప్రతీ యావరేజ్ ప్రొడ్యూసర్ నీ వేధించే సమస్యే ఇది. అయినా బైటికి చెప్పుకోలేడు. మౌనంగానే ముందుకు నడుస్తాడు.
మరిన్ని ఇక్కడ చదవండి :