SP Balu: ఎస్పీ బాలు అర్హుడే.. నా సోదరుడికి పద్మవిభూషణ్ దక్కడం సంతోషంగా ఉంది: మెగాస్టార్ చిరంజీవి
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయిన సంగతి తెలిసిందే. బాలు కన్నుమూసిన అనంతరం 2021 సంవత్సరానికి..
Chiranjeevi: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికయిన సంగతి తెలిసిందే. బాలు కన్నుమూసిన అనంతరం 2021 సంవత్సరానికి గాను ఈ అవార్డుతో సత్కరించనున్నట్లు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఇప్పటికే పద్మశ్రీ పురస్కారం అందుకున్న బాలుకు పద్మవిభూషణ్ పురస్కారం కూడా లభించడం పట్ల టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఉదయం ట్విట్ చేశారు.
‘‘నా ప్రియమైన సోదరుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించడం పట్ల సంతోషంగా ఉంది. ఆయన దీనికి అర్హుడు. మరణానంతరం అనే పదం బ్రాకెట్స్‌లో ఉండడం పట్ల బాధ కలుగుతోంది. ఈ అవార్డును ఆయన వ్యక్తిగతంగా స్వీకరిస్తే బాగుండేది’’ అంటూ మెగాస్టార్ చిరంజివీ ట్వీట్ చేశారు. కాగా ఎస్పీ బాలుకు తమిళనాడు తరఫున ఈ పురస్కారం లభించింది. ఆయనతోపాటు గాయకురాలు చిత్ర కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు.