కోలీవుడ్ హీరోయిన్ పార్వతి నాయర్ పై చెన్నై తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తన ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఆమెపై ఫిర్యాదు చేయడంతో నటితోపాటు ఆమె స్నేహితులపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు చెన్నై పోలీసులు. పార్వతి నాయర్ ఇంట్లో పనిచేస్తున్న తనను దొంగతనం నెపంతో గదిలో బంధించి ఆమె స్నేహితులతో కలిసి టార్చర్ చేసిందని సదరు వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హీరోయిన్ పార్వతి నాయర్, అయాలా చిత్ర నిర్మాత కొడప్పాడి రాజేష్ సహా 7 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసలు విషయానికి వస్తే.. నటి పార్వతి నాయర్ చెన్నైలోని నుంగంబాక్కంలో నివసిస్తున్నారు. 2022లో తన ఇంట్లో రూ.10 లక్షల విలువైన వాచ్‌లు, ఐఫోన్, ల్యాప్‌టాప్ తదితర వస్తువులు చోరీకి గురయ్యాయని నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో పని చేస్తున్న సుభాష్ చంద్రబోస్ పై తనకు అనుమానాలు ఉన్నాయని నటి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో నుంగంబాక్కం పోలీసులు పుదుకోట్టై ఉద్యోగి సుభాష్ చంద్రబోస్‌పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అయితే తాను ఎలాంటి దొంగతనం చేయలేదని.. తనను గదిలో బంధించి కొట్టారని.. పార్వతి నాయర్ తోపాటు మరో 7గురిపై తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు సుభాష్. తనపై తప్పుడు కేసులు పెట్టి టార్చర్ చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సుభాష్ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో చెన్నైలోని సైదాపేట కోర్టును ఆశ్రయించాడు బాధితుడు.
ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సుభాష్ ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ సుభాష్ కొద్ది రోజుల క్రితం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.అబుదాబిలో మలయాళ కుటుంబంలో జన్మించిన పార్వతి నాయర్ మొదట సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పని చేసి, మోడలింగ్ తర్వాత చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. పార్వతి నాయర్ కన్నడ చిత్రం వాస్కోడిగామాలో నటించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.