ఆ రెండు పొరపాట్ల కారణంగా రూ.6 కోట్లు నష్టపోయా: ప్రముఖ నిర్మాత సంచలన కామెంట్లు
సినిమా అంటే వినోదాన్ని పంచేది అయినా.. దర్శక నిర్మాతలకు అదే జీవితం. ఒక సినిమా తీసి మెప్పిస్తే ఎంత పేరు వస్తుందో ప్లాప్ అయితే కూడా అంతే నష్టపోవలసి వస్తుంది. ఒక్కోసారి పెట్టుబడి వస్తుంది ఒక్కోసారి అది కూడా రాదు. చిన్న పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా ఏ నిర్మాతకైనా నష్టాలు రావచ్చు.

ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ తెలుగు సినీ పరిశ్రమలో గీతా ఆర్ట్స్‌కు చెందిన కీలక వ్యక్తిగా చాలా మందికి తెలిసినవాడు. చాలా ఏళ్లుగా గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో భాగమై, ‘జీఏ2’ పేరుతో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవల సొంతంగా ‘బన్నీ వాసు వర్క్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. సినిమాలు నిర్మించడమే కాకుండా ఇతర చిత్రాలను రిలీజ్ చేస్తూ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
వంశీ నందిపాటితో కలిసి రిలీజ్ చేసిన తొలి చిత్రం ‘లిటిల్ హార్ట్స్’ సంచలన విజయం సాధించగా, ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ వంటి చిత్రాలు కూడా మంచి ఫలితాలు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో బన్నీ వాసు సొంత నిర్మాణంలో వచ్చిన ‘మిత్రమండలి’ మాత్రం అందరినీ నిరాశపరిచింది. ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం లీడ్ రోల్స్‌లో నటించిన ఈ కామెడీ డ్రామా విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాసు ఈ సినిమా గురించి ఓపెన్ అయ్యారు. ‘మిత్రమండలి’ వల్ల తమకు రూ.6 కోట్ల నష్టం వచ్చిందని స్వయంగా వెల్లడించారు. అంతకుముందు మేకింగ్ సమయంలో సినిమా బాగా ఆడుతుందని, కామెడీ బాగా వర్కవుట్ అవుతుందని కాన్ఫిడెన్స్‌గా ఉన్నామని చెప్పారు. కానీ ఎడిటింగ్‌లో పొరపాటు జరిగిందని, ఆర్‌ఆర్ (రీ-రికార్డింగ్) కూడా సరిగా రాలేదని అన్నారు.

Mithramandali Poster & Bunny Vasu
అతి పెద్ద తప్పు అని బన్నీ వాసు చెప్పారు. మరో విషయం ఏంటంటే.. రిలీజ్‌కు ముందు ఫైనల్ కాపీని తాను చూడలేదట. సెంటిమెంట్ కారణాలతో ఒక గుడికి వెళ్లి మూడు రోజులు అందుబాటులో లేకపోవడంతో ఆ అవకాశం మిస్ అయిందని వివరించారు. ప్రీమియర్ షోలో థియేటర్‌లో కూర్చుని సినిమా చూసినప్పుడు, తాను అనుకున్న చోట జనాలు నవ్వకపోవడంతో సినిమా మిస్ ఫైర్ అయినట్లు అర్థమైందని చెప్పారు. ”ఈ సినిమా వల్ల అందరం కలిపి రూ.6 కోట్లు పోగొట్టుకున్నాం” అని బన్నీ వాస్ అంగీకరించారు.
అక్టోబర్ 2025లో విడుదలైన ‘మిత్రమండలి’ బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 10 కోట్లు రాబట్టాల్సి ఉండగా, టోటల్ రన్‌లో కేవలం 2 కోట్ల గ్రాస్ మార్క్‌నే తాకింది. దీంతో భారీ నష్టాలు తప్పలేదు. అయినప్పటికీ బన్నీ వాస్ నిరాశ చెందకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే వరుస విజయాలతో ట్రాక్ రికార్డు ఉన్న ఆయనకు ఈ ఒక్క ఫ్లాప్ పెద్దగా ప్రభావం చూపదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
