
ఒకప్పుడు ఆయనతో కలిసి నటించిన బాలీవుడ్ సీనియర్ నటి.. సుమారు పదమూడేళ్ల తర్వాత ఆ రహస్యాన్ని బయటపెట్టింది. షూటింగ్ సమయంలో దర్శకుడు ఒక సీన్ చేయమని కోరితే, ఆయన మాత్రం ఖచ్చితంగా కుదరదు అని తెగేసి చెప్పారట. ఆయన తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం చూసి సెట్స్‌లో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారట. మహిళల పట్ల ఆయనకు ఉన్న గౌరవం చూసి ఆ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఇంతకీ ఆ నటి ఎవరు? ఎన్టీఆర్ సెట్స్‌లో అంత కఠినంగా నిరాకరించిన ఆ సన్నివేశం ఏంటి?
ప్రముఖ బాలీవుడ్ నటి పూజా బేడీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. గతంలో ‘చిట్టెమ్మ మొగుడు’ (1993), ‘శక్తి’ (2011) వంటి సినిమాల్లో ఆమె నటించింది. చాలా కాలం తర్వాత ఆమె మళ్ళీ తెలుగు తెరపై కనిపిస్తోంది. చంద్రహాస్ హీరోగా నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమాలో ఆమె ఒక కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో పూజా బేడీ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
‘శక్తి’ సినిమా షూటింగ్ సమయం నాటి ఒక సంఘటనను పూజా బేడీ గుర్తు చేసుకుంది. “శక్తి సినిమాలో నేను సోనూసూద్‌కు భార్యగా నటించాను. అందులో నాది నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. కథ ప్రకారం ఒక సీన్‌లో హీరో ఎన్టీఆర్ నాతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ సీన్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఏమాత్రం ఒప్పుకోలేదు. ఆడవారితో నేను ఫైట్ చేయలేనని ఆయన నిరాకరించారు. సినిమా కోసమైనా ఒక మహిళపై చేయి ఎత్తడం తనకు ఇష్టం లేదని ఆయన చెప్పడం నాపై గౌరవాన్ని మరింత పెంచింది” అని పూజా బేడీ వివరించింది. ఇప్పటి సినీ ప్రపంచంలో ఇలాంటి విలువలు పాటించే వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని ఆమె ప్రశంసించింది.
Jr Ntr N Pooja Bedi
సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లతో లేదా నెగెటివ్ పాత్రలు చేసే మహిళలతో హీరోలు ఫైట్ చేయడం సహజమే. కానీ ఎన్టీఆర్ మాత్రం మొదటి నుంచీ మహిళలకు ఇచ్చే గౌరవం విషయంలో ఎక్కడా తగ్గరు. తన సినిమాల్లో మహిళా పాత్రలను కించపరిచేలా ఉండకూడదని ఆయన కోరుకుంటారు. పూజా బేడీ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా “తారక్ అంటే కేవలం నటుడు మాత్రమే కాదు.. ఒక గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన చివరగా ‘వార్ 2’లో కనిపించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం తారక్ తన పూర్తి దృష్టిని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాపై పెట్టారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర 2’ కూడా లైన్లో ఉంది. ఈ సినిమాలతో తారక్ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నారు. పూజా బేడీ వెల్లడించిన ఈ విషయం తారక్ అభిమానులకు ఒక గొప్ప కానుక అని చెప్పాలి. స్టార్ హోదాలో ఉండి కూడా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే తారక్ వంటి హీరోలు ఉండటం గర్వకారణం.