
ఆట సందీప్ అలియాస్ సందీప్ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఇతని డ్యాన్స్ వీడియోలు తెగ వైరలవుతుంటాయి. ముఖ్యంగా చిరంజీవి పాటలకు తన భార్య జ్యోతితో కలిసి హుషారైన స్టెప్పులు వేస్తుంటాడీ డ్యాన్స్ మాస్టర్. ఈ వీడియోలకు నెటిజన్లు, ముఖ్యంగా మెగాభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లోనూ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశాడు సందీప్ మాస్టర్. టైటిల్ గెల్చుకోకపోయినా తన ఆట, మాట తీరుతో చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం సొంతంగా స్టూడియో పెట్టి ఎంతోమందికి డ్యాన్స్ లో శిక్షణ ఇస్తున్నాడీ డ్యాన్స్ మాస్టర్. ఇదిలా ఉంటే తాజాగా తన భార్య జ్యోతితో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లాడు సందీప్ మాస్టర్. అక్కడ ఆయనతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇదే సందర్భంగా ఒక ఎమోషనల్ నోట్ పెట్టాడు.
‘నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రోజు! స్వయంగా ఆ దేవుడ మెగాస్టార్ చిరంజీవి గారు లా దిగివచ్చి మాకు వరం ఇచ్చినట్టుగా అనిపించింది. ఎన్నేళ్లుగా నేను నమ్ముకున్న నా డాన్స్‌ను, నా కష్టాన్ని చూసి.. అయనే స్వయంగా నన్ను ఇంటికి పిలిచి, నాకు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు. ఆ క్షణం నాకు సాక్షాత్ పరమశివుడు ఆశీర్వాదం చేసినట్టుగా అనిపించింది. అది పూర్తిగా దైవానుగ్రహం లాంటి అనుభూతి… హృదయం మొత్తం ఆనందంతో నిండిపోయింది. అందులోను మా జంట గురించి, నా వైఫ్ జ్యోతి గురించి ఆయన చెప్పిన మాటలు… మాకు ఇచ్చిన ఆశీర్వాదాలు… మా జీవితానికి కొత్త బలం, ముందుకు నడిపించే పెద్ద ధైర్యం ఇచ్చాయి. ఆ మాటలు మా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోతాయి. చిరంజీవి గారు స్వయంగా పిలిచి ఇచ్చిన ఈ అవకాశం..చిన్నప్పటి నుండి కలగన్న ఆ కల నిజంగా నెరవేరిన రోజు.’
‘అయనతో కూర్చొని మాట్లాడిన ప్రతీ క్షణం, అయన చూపిన ఆప్యాయం, వినయం, ప్రేమ అన్నీ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గుర్తులయ్యాయి. సహృదయ కృతజ్ఞతలతో.. ధన్యవాదాలు చిరంజీవి గారూ, ఈ అవిస్మరణీయ అవకాశం, మీ ఆశీర్వాదాలు, మీ ప్రేమ— ఇవి నాకు కొత్త దారి, కొత్త శక్తి ఇచ్చాయి. త్వరలోనే బిగ్ న్యూస్ తో మీ ముందుకు వస్తాను’ అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు సందీప్ మాస్టర్.
సందీప్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా మెగాభిమానులు ఈ పోస్ట్ ను తెగ షేర్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.