NTR ఎంత రిక్వెస్ట్ చేసినా దానవీరశూరకర్ణలో ANR ఎందుకు నటించలేదంటే..?
నటరత్న ఎన్టీఆర్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన దానవీరశూరకర్ణ చిత్రం అనేక ప్రత్యేకతలతో నిలిచింది. ఒకే సినిమాలో మూడు పాత్రలు పోషించడం అప్పట్లో సాహసం. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు నటించడానికి నిరాకరించడం, అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రయత్నాలు, రికార్డు సమయంలో షూటింగ్ పూర్తి చేయడం వంటి ఆసక్తికర విషయాలతో ఈ చిత్రం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

నటరత్న ఎన్టీఆర్ నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన దానవీరశూరకర్ణ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి. ఒకే చిత్రంలో మూడు విభిన్న పాత్రలు (శ్రీకృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు) పోషించడం, ఆ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించడం అనేది ప్రపంచ సినిమా చరిత్రలోనే అరుదైన, సాహసోపేతమైన ఘట్టం. ఇది నటరత్న ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమైంది. నిజానికి, ఈ మూడు పాత్రలు తనే పోషించాలని ఎన్టీఆర్ మొదట అనుకోలేదు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్‌ల మధ్య అభిప్రాయభేదాలు తొలగిపోయిన తరువాత, ఓ సందర్భంలో దానవీరశూరకర్ణ చిత్రంలో శ్రీకృష్ణుడిగా కానీ, కర్ణుడిగా కానీ నటించమని ఎన్టీఆర్, ఏఎన్నార్‌ను కోరారు. అయితే, ఏఎన్నార్ శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్‌ను చూసిన కళ్లతో తనని జనం చూడరని చెప్పి నిరాకరించారు. కర్ణుడి పాత్ర విషయంలోనూ, తాను నటిస్తే పాండవులు మరుగుజ్జుల్లా కనిపిస్తారని జోక్ చేస్తూ ఆయన అంగీకరించలేదు.
ఎన్టీఆర్ పట్టువిడవకుండా, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావును అక్కినేనిని ఒప్పించమని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో జలగం వెంగళరావును కలిసిన అక్కినేని, ఇద్దరూ కలిసి నటిస్తే జనం బాగా చూస్తారని వెంగళరావు చెప్పినా, ఎన్టీఆర్‌కు చెప్పిన సమాధానాన్నే మళ్లీ చెప్పి బయటపడ్డారు. శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రం ప్రివ్యూ చూసిన ఏఎన్నార్ సతీమణి అన్నపూర్ణ, “రామారావు గారి పక్కన ఇలా ఎప్పుడూ పౌరాణిక పాత్రలు వేయకండి, మీరు తేలిపోతారు” అని భర్తతో చెప్పిన విషయం గుర్తు ఉండడం వల్లే అక్కినేని ఈ చిత్రంలో నటించడానికి అంగీకరించలేదని తెలిసింది. అయినప్పటికీ, చారిత్రక చిత్రం కావడంతో ఎన్టీఆర్‌తో కలిసి చాణక్య చంద్రగుప్తలో నటించారు. హైదరాబాద్‌లో వార్ సీన్స్‌తో సహా భారీ పౌరాణిక చిత్రాన్ని నిర్మించడం దానవీరశూరకర్ణతోనే ప్రథమం. రామకృష్ణ స్టూడియోలో కీలక సన్నివేశాలు చిత్రీకరించగా, యుద్ధ సన్నివేశాలను రామకృష్ణాపురం దగ్గర సైనిక్ పురి దాటిన తర్వాత ఉన్న ఓ పెద్ద బహిరంగ స్థలంలో, ఒక చెరువు పక్కన ఎన్టీఆర్ తీశారు. ఛాయాగ్రాహకులు కన్నప్ప, రెహమాన్, కె. ఎస్. ప్రసాద్ మూడు కెమెరాలతో ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. వర్షాల కారణంగా మిగిలిపోయిన సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో పూర్తి చేశారు. ఒక అగ్ర హీరో నిర్మించిన స్టూడియోలో మరో అగ్ర హీరో షూటింగ్ చేయడం అపురూప దృశ్యం. ఆ సమయంలోనే ఏఎన్నార్ సెట్ కు వచ్చి ఎన్టీఆర్ ను కలిసి సినిమా విశేషాలపై చర్చించారు. సరోవరంలో నీటి అడుగున సుయోధనుడు దాక్కునే సన్నివేశం, కర్ణుడిగా ఎన్టీఆర్, అభిమన్యుడిగా బాలకృష్ణ పాల్గొన్న వార్ సీన్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోని సెట్ లోనే చిత్రీకరించారు.
డిసెంబర్ 20 కల్లా షూటింగ్ పూర్తి చేసుకున్న దానవీరశూరకర్ణ, పోటీగా హీరో కృష్ణ కురుక్షేత్రం చిత్రం తీస్తుండటంతో కేవలం 43 రోజుల్లో పూర్తయ్యింది. 25 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ 35 ఎం.ఎం. లో తీశారు. కురుక్షేత్రం సినిమాస్కోప్ లో రావడంతో, దానవీరశూరకర్ణను కూడా కొన్ని ప్రింట్లు సినిమాస్కోప్‌లోకి బ్లో అప్ చేసి విడుదల చేయాలని ఎన్టీఆర్ భావించినా, జనవరి 14న సినిమా విడుదల చేయాలనే నిర్ణయంతో సమయం సరిపోక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. జనవరి 10 లోపు సెన్సార్ పూర్తి చేసి, జనవరి 10న అడవిరాముడు షూటింగ్ కోసం ఎన్టీఆర్ ముదుమలై ఫారెస్ట్‌కు వెళ్లారు. 1977 జనవరి 14న దానవీరశూరకర్ణ, కురుక్షేత్రం చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఈ పోటీలో ఎన్టీఆర్ చిత్రం పైచేయి సాధించి, భారీ విజయాన్ని అందుకుంది.
(ఈ సమాచారం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టుల నుంచి సేకరించాం)
