
వయసు అనేది కేవలం ఒక నంబర్ మాత్రమే అని నిరూపిస్తున్నారు ఆ దిగ్గజ నటి. ఒకప్పుడు వెండితెరపై తన నాట్యంతో, నటనతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టిన ఆమె, ఇప్పుడు 90 ఏళ్లు దాటినా కూడా అదే చురుకుదనంతో కనిపిస్తున్నారు. సాధారణంగా ఈ వయసులో నడవడమే కష్టమనుకునే కాలంలో, ఆమె మాత్రం ఏకంగా స్టేజ్ ఎక్కి నృత్య ప్రదర్శనలు ఇస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇటీవల ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. “ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు?” అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ నటి ఎవరు, ఆమె పాటించే ఆ సీక్రెట్ లైఫ్ స్టైల్ ఏంటో తెలుసుకుందాం..
ఆమె ఆరోగ్యంగా ఉండటానికి ప్రధాన కారణం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవడం, క్రమం తప్పకుండా యోగా, ధ్యానం చేయడం ఆమె అలవాటు. వీటితో పాటు ఉదయాన్నే వాకింగ్ చేయడం వల్ల తన శరీరం చురుగ్గా ఉంటుందని ఆమె నమ్ముతారు. కేవలం ఫిజికల్ ఫిట్‌నెస్ మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కోసం ఆమె నిరంతరం పరిశోధనలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి చేస్తుంటారు.
ఆమె తీసుకునే ఆహారం చాలా సింపుల్‌గా, సంప్రదాయబద్ధంగా ఉంటుంది. ఉదయం దోశ, ఉతప్పం లేదా ఉప్మా వంటి సౌత్ ఇండియన్ టిఫిన్లతో పాటు తాజా పండ్ల రసాలను తీసుకుంటారట. మధ్యాహ్నం అన్నం, రసం లేదా పప్పు వంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తింటారట. సాయంత్రం డ్రై ఫ్రూట్స్ లేదా పండ్ల రసాలు మాత్రమే తీసుకుంటారట. రాత్రి చాలా తక్కువగా అంటే ఒక రోటీ లేదా పప్పు అన్నం తీసుకుని త్వరగా నిద్రపోతారట.
Vyjayanthimala1
92 ఏళ్ల వయసులోనూ ఎంతో గ్రేస్‌తో కనిపిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ఆ నటి మరెవరో కాదు.. లెజెండరీ యాక్ట్రెస్ వైజయంతిమాల బాలి! అవును, ‘సంగమ్’, ‘మధుమతి’ వంటి సినిమాలతో ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన ఈ అందాల నటి, తొమ్మిది పదుల వయసులోనూ తన ఫిట్‌నెస్‌తో నేటి తరం వారికీ స్ఫూర్తినిస్తున్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె కుర్చీలో కూర్చుని కేవలం తన ముఖ కవళికలతో నృత్యం చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. సింపుల్ డైట్, నిరంతర సాధన, మరియు కళపై ఉన్న మక్కువ.. ఇవే వైజయంతిమాల ఆరోగ్య రహస్యాలని స్పష్టమవుతోంది. వృద్ధాప్యాన్ని జయించి, నిత్య నూతనంగా ఎలా ఉండాలో ఆమెను చూసి నేర్చుకోవచ్చు. ఆమె ఇలాగే నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిద్దాం!