Mega Brothers: ఏపీ సర్కార్ (Ap Govt) అండ్ మెగాబ్రదర్స్… మధ్యలో సినిమా పరిశ్రమ (Tollywood). ఈ ట్రయాంగిల్ డ్రామా పూటకో ట్విస్టుతో నాన్‌స్టాప్‌గా కొనసాగుతోంది. నానాటికీ కలర్‌ఫుల్‌గా మారిపోతోంది. పెద్ద సినిమాలు పెద్దపెద్ద కష్టాల్లో పడిపోయాయి… మాకున్న చిన్నచిన్న సమస్యల్ని మీరే పెద్ద మనసు చేసుకుని పరిష్కరించాలి అని… మెగాస్టార్ చిరంజీవి.. ఒక టీమ్‌ని ఫామ్ చేసుకుని మొన్నామధ్య అమరావతి టూరేశారు. తల్లి స్థానంలో ఉన్నారు… మమ్మల్ని కూడా మీ బిడ్డల్లా భావించి ఆదుకోండి… మీ కరుణా కటాక్షాలే మాకు శ్రీరామ రక్ష అంటూ పాలకుల్ని చేతులు జోడించిమరీ వేడుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మీడియాలో లీకైన ఆ ఘట్టం… సినీ-రాజకీయ వర్గాల్లో బాగా పేలింది. దాని తాలూకు చిటపటలు ఆ తర్వాత చాలారోజుల పాటు వినిపించాయి. ఎక్కడ తగ్గాలో తెలిసిన పెద్ద మనిషి అంటూ చిరంజీవికి కాంప్లిమెంట్లు కూడా పడ్డాయి.
ఇలా అన్నయ్య హోదాలో హుందాగా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కారం వైపు రెండడుగులు ముందుకు జరిపితే.. తమ్ముళ్లు మాత్రం నాలుగడుగులు వెనక్కి లాగేశారు. లేని సమస్యను సృష్టించేదీ మీరే… ఆనక పరిష్కరించుకుందాం రండి అంటూ ఆహ్వానాలు పంపేదీ మీరే… ఇదెక్కడి జగన్నాటకం అంటూ… గొంతెత్తి అరిచారు మెగా తమ్ముడు నాగబాబు. అంచెలంచెలుగా కుళ్లబొడిచేకంటే ఇండస్ట్రీ మొత్తాన్ని ఒకేసారి ఊచకోత కోసెయ్యండి… తెలుగు సినిమాల్ని మీ రాష్ట్రంలో నిషేధించుకోండి.. ఆ తర్వాత మా బతుకు మేం ఎలా బతుకుతామో చూపిస్తాం అని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు మెగాబ్రదర్ నాగబాబు.
చిన్న తమ్ముడైతే ఇంకో రెండాకులు ఎక్కువే నమిలేశారు. ఒక పొలిటికల్ మీటింగులో మాట్టాడుతూ… ప్రభుత్వం మీద, పన్లో పనిగా పెద్దన్నయ్య మీద కూడా పటాసులు పేల్చేశారు. ఏం మీరేమన్నా డిక్టేటర్లా… మీ దగ్గరికొచ్చి బాబ్బాబూ అని దీనంగా అడుక్కుంటేనే పని చేస్తారా అంటూ మైకు ముందు కసికసిగా కలిపికొట్టేశారు. దాని ఫలితమో మరోటో తెలీదు గాని… రాసిపెట్టి సంతకాలు కూడా అయిపోయిన జీవోలు గవర్నమెంటోళ్ల సొరుగుల్లోనే ఉండిపోయాయి. తన భీమ్లానాయక్ సినిమా గట్టిగానే పరిహారం చెల్లించుకుంది. అధమపక్షం 30 శాతం దాకా వసూళ్లకు గండిపడ్డట్టు లెక్క తేలింది.
సీఎంతో సమావేశం తర్వాత బైటికొచ్చి… జస్ట్ వారంరోజులాగండి… శుభవార్త వినబోతున్నాం అని మాటిచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. కానీ… ఇది జరిగి దాదాపు నెలరోజులు కావస్తోంది. అయినా… థియేటర్ బిజినెస్‌కి ఊపిరిలూదే ఆ కొత్త జీవోలు ఇంకా జారీ కానే లేదు. పెద్ద సినిమాలు మాత్రం కమింగ్ సూన్ అంటూ ఆశగా ఆకాశంకేసి చూస్తూనే వున్నాయి. తెలుగు పరిశ్రమ ఇలా త్రిశంకు స్వర్గంలోనే వుండిపోవడానికి కారణం ఆ మెగా బ్రదర్సేనా…. అనే కొత్త చర్చ మొదలైంది ఇండస్ట్రీలో. ముగ్గురు సోదరులూ ఒకేమాట మీద ఉండి ఇప్పటికైనా సెట్ చేయగలరా..? అనేది సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది..
– రాజా శ్రీహరి (టీవీ9, ET డెస్క్)
Also Read: Beard Itching: గడ్డం దురదగా ఉంటుందా.. మీరు ఈ తప్పులు చేస్తున్నారని అర్థం..!