రాజమండ్రి, అక్టోబర్ 3: ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళిపై కేసు నమోదైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నిరాధారమైన అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు పోసాని ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి గతంలో జనసేన పార్టీ నేతలు రాజమండ్రి వన్ టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో జనసేన నేతలు కోర్టును ఆశ్రయించారు. తాజాగా జనసేన నేతల పిటిషన్‌పై విచారించిన కోర్టు పోసానిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను అదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు పోసానిపై ఐపీసీలోని 354, 355, 500,504, 506, 5007, 5009 సెక్షన్ల కింద కేసు వన్ టౌన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను, ఆయన కుటుంబాన్ని పోసాని కృష్ణమూర్తి దూషించారని గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో యందం ఇందిరా 2022లో రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు స్పందించక పోవడంతో కోర్టును ఆశ్రయించారు. కాగా పోసాని కృష్ణమూర్తిపై కేసు నమోదు కావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ప్రముఖులపై నోరు పారేసుకోవడం, పోలీసులు కేసులు పెట్టడం కూడా జరిగింది. నారా లోకేష్‌ను దూషించినందుకు గానూ కోర్టులో పోసానిపై డిఫమేషన్ పిటిషన్ (పరువునష్టం దావా) వేశారు. అయితే తనను కోర్టుల చుట్టూ తిప్పుతూ హత్య చేయాలని కుట్ర చేస్తున్నట్లు పోసాని ఆరోపించారు. కోర్టులో కేసులు నడుస్తున్నా తన పంథామార్చుకోని పోసాని తాజాగా పవన్‌ను, ఆయన కుటుంబాన్ని తనదైన నోటి దురుసుతనంతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో తాజాగా మరోమారు ఆయనపై మళ్లీ కేసు నమోదైంది.
వైఎస్ఆర్‌సీపీ నేత పోసాని కృష్ణమురళి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ ధియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్‌కు పోసాని కృష్ణమురళి వీరాభిమాని. రాజకీయాల నేపథ్యంలో ఆయన పలుమార్లు పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీలో అందర్నీ ఆయన అసభ్యంగా దూషించిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఎంతో కాలంగా వైసీపీకి నమ్మకస్తుడిగా పని చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క పదవి కూడా లభించలేదు. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల కేటాయింపు అంశంపై సంప్రదింపులు జరిపినప్పుడు సినీ నటుడు ఆలీ, పోసానిని కూడా ఆహ్వానించింది. ఆ తర్వాత కూడా పోసాని కృష్ణమురళి సీఎం జగన్‌ను మరోసారి వ్యక్తిగతంగా కలిశారు. ఆ తర్వాత ఆయనకు ధియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రకటించారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.