టాలీవుడ్ స్వీటీ అనుష్కా శెట్టి నటించిన మొట్ట మొదటి లేడీ ఓరియంటెడ్ సినిమా అరుంధతి. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా 2009 లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పటివరకు కేవలం గ్లామరస్ పాత్రలు పోషిస్తూ వచ్చిన అనుష్క అరుంధతి సినిమా తో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇందులో అనుష్కా శెట్టి డ్యూయల్ రోల్ పోషించగా, సోనూసూద్ క్రూరమైన పశుపతి పాత్రలో జనాలను భయ పెట్టాడు. షాయాజీ షిండే, సత్యనారాయణ, మనోరమ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక జేజమ్మ పాత్రలో అనుష్క నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన అరుంధతి సినిమా..థియేటర్ల దగ్గర కాసుల వర్షం కుమ్మరించింది. కేవలం రూ. 13 కోట్ల పెట్టి సినిమా తీస్తే.. 70 కోట్లు వసూలు చేసినట్లు టాక్. ఇప్పుడు కూడా టీవీలో అరుంధతి సినిమా వస్తే మిస్ అవ్వని వారు చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సంబంధించిన ఒక డిలీటెడ్ సీన్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. సినిమా రిలీజై సుమారు 15 ఏళ్లు గడిచినా ఆ సీన్ ఇంకా నెట్టింట ట్రెండ్ అవుతోంది. దీనిని చూసిన వారందరూ సినిమాలో ఈ సీన్ ఉండి ఉంటే అరుంధతి వేరే లెవెల్ లో ఉండేదంటున్నారు.
ఇంతకీ ఈ సీన్ లో ఏముందంటే.. వంటగదిలో ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటుంది అనుష్క. అక్కడ ఓ పెద్ద మంటపై ఓ బాణీలో నూనె కాగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడకు ఓ చిన్నారి వచ్చి.. పొయ్యి పక్కనే ఉన్న చెక్కపై పెట్టిన పిండి పదార్థాలను తీసుకునేందుకు పైకి ఎక్కుతుంది. అంతలో కాలు జారి నూనెలో పడబోతుంటే.. వెనుక నుంచి అనుష్క కత్తి విసురుతుంది. అది పాప చొక్కాకు తగిలి.. వేలాడేలా చేస్తుంది. దీంతో పాప నూనెలో పడకుండా కాపాడుతుంది. దీనిని చూసిన మనోరమ.. గతంలో సోనూసూద్ ను చంపేందుకు అతడు మంత్రాలు చదవకుండా ఉండేందుకు.. నోటిలో కత్తి దింపే సీన్ ను గుర్తుకు తెచ్చుకుంటుంది. ఇప్పుడిదే సీన్ నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం అనుష్క క్రిష్ దర్శకత్వంలో ఓ లేడి ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.