AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నమయ్యలో సుమన్ చేసిన వెంకన్న స్వామి పాత్ర చేయనన్న తెలుగు హీరో ఎవరో తెలుసా..?

నాగార్జున, రాఘవేంద్రరావుల కలయికలో రూపుదిద్దుకున్న అన్నమయ్య చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయి. కమర్షియల్ ఇమేజ్ ఉన్న హీరో, దర్శకుడు భక్తిరస చిత్రం తీయడం సాహసమే అయినా, అద్భుతమైన నటన, సంగీతం, దర్శకత్వంతో ఘన విజయం సాధించి, విమర్శకుల ప్రశంసలు పొందింది.

అన్నమయ్యలో సుమన్ చేసిన వెంకన్న స్వామి పాత్ర చేయనన్న  తెలుగు హీరో ఎవరో తెలుసా..?
Annamayya Movie
Ram Naramaneni
|

Updated on: Sep 07, 2026 | 11:57 AM

Share

తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నో చిత్రాలు వస్తూపోతూ ఉంటాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని, చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన చిత్రాలలో కింగ్ నాగార్జున నటించిన అన్నమయ్య ఒకటి. 1997లో విడుదలైన ఈ చిత్రం కేవలం ఒక సినిమాగా మాత్రమే కాకుండా, ఒక సాంస్కృతిక దృశ్యకావ్యంగా మారింది. నాటి కమర్షియల్ సినిమాల హవాలో అల్ట్రామోడర్న్ హీరోగా వెలుగొందుతున్న నాగార్జున, ఒక భక్తుడి పాత్రలో నటించడానికి అంగీకరించడం నిజంగా ఒక సాహసోపేతమైన నిర్ణయం. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సైతం మాస్ మసాలా అంశాలకు ప్రసిద్ధి. అటువంటి దర్శకుడు పూర్తిస్థాయి భక్తిరస చిత్రం తీయడం, అందులో నాగార్జున హీరోగా నటించడం ఆ రోజుల్లో పెద్ద వార్త. అక్కినేని నాగేశ్వరరావు వంటి మహానటులు ఎన్నో భక్తిరస పాత్రలు పోషించినా అన్నమయ్య పాత్ర చేసే అవకాశం ఆయనకు లభించలేదు. నాగార్జున కోసమే ఆ పాత్ర అలా ఉండిపోయిందని చాలామంది భావించారు. అన్నమయ్య పాత్రలో నాగార్జున ఒదిగిపోయి చూపిన అభినయం, ఆయనను భక్తిరస చిత్రాల నాయకుడిగా నిలిపింది. శ్రీరామదాసు, ఓం నమో వెంకటేశాయ వంటి చిత్రాల్లో ఆయన పాత్రకు జీవం పోశారు.

సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి స్వరపరిచిన ప్రతి పాట ఒక ఆణిముత్యం. అన్నమయ్య ఆల్బమ్ నాటి నుంచి నేటి వరకు ప్రతి తెలుగు ఇంట్లో దేవుడి పాటల క్యాసెట్లలో భాగమైందంటే దాని విజయం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. వెంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్ అద్భుతంగా నటించారు. మొదట శోభన్ బాబును సంప్రదించినా, ఆయన తిరస్కరించడంతో సుమన్‌ను ఎంపిక చేశారు. మొదట్లో కొంతమంది విమర్శించినా, వెంకటేశ్వరస్వామి గెటప్‌లో సుమన్‌ను చూసి ప్రేక్షకులు ఎంతగానో మెచ్చుకున్నారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పడం ఆయన పాత్రకు మరింత నిండుదనం తీసుకొచ్చింది. ఈ చిత్రంలో మోహన్ బాబు, రోజా, రమ్యకృష్ణ, భానుప్రియ, కస్తూరి, శ్రీకన్య వంటి ప్రముఖ నటీనటులు నటించడం మరో విశేషం. ఐదు కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మల్టీస్టారర్ చిత్రం, తెలుగులో డాల్బీ స్టీరియో సిస్టమ్‌లో రూపొందిన తొలి చిత్రం కూడా ఇదే. నిర్మాత దొరస్వామిరాజు కథ, మాటలు అందించిన జె.కె. భారవిల కృషి ఈ సినిమా విజయానికి మూలం.

సినిమా షూటింగ్ 1996 సెప్టెంబర్ 19న అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్లాప్ ఇచ్చారు. కేరళలోని షోర్నూర్, తిరుపతి వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ జరిగింది. తిరుమలలో షూటింగ్ అనుమతి లభించకపోవడంతో, అన్నపూర్ణ స్టూడియోలో తిరుమల దేవాలయం సెట్ వేసి కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఎనిమిది నెలల పాటు, 82 వర్కింగ్ డేస్‌లో సినిమా నిర్మాణం పూర్తయింది. 1997 మే మొదటి వారంలో పాటలు విడుదలయ్యాయి. తొలి బంచ్‌లోనే మూడు లక్షల క్యాసెట్లు అమ్ముడయ్యాయి. పాటలు హిట్ అయినా, నాగార్జున భక్తిరస చిత్రం కావడంతో కొందరు బయ్యర్లు సినిమా ఆడదని అపనమ్మకంతో ఉన్నారు. అందుకే నిర్మాత దొరస్వామిరాజు ఎవ్వరికీ అమ్మకుండా సినిమాను సొంతంగా 110 థియేటర్లలో విడుదల చేశారు. మే 22, 1997న విడుదలైన ఈ సినిమాపై నాగార్జున అభిమానులకు కూడా పెద్దగా ఆశలు లేవు. కానీ నూన్ షో చూసిన తర్వాత వారి నోట మాట రాలేదు. నాగార్జున అభినయం, రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ, ముఖ్యంగా 92 ఏళ్ల వృద్ధుడి గెటప్‌లో నాగార్జున పతాక సన్నివేశంలో నటించిన తీరు చూసి ప్రేక్షకులు కంటతడి పెట్టారు.

మొదటి వారం వసూళ్లు తక్కువగా ఉన్నా, మౌత్ టాక్‌తో రెండో వారం నుంచి కలెక్షన్ల సునామీ మొదలైంది. దాసరి నారాయణరావు ఒసేయ్ రాములమ్మ, విక్టరీ వెంకటేష్ ప్రేమించుకుందాం రా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పోటీపడి, అన్నమయ్య 70 కేంద్రాలలో 50 రోజులు, 42 కేంద్రాలలో 100 రోజులు, హైదరాబాద్, విజయవాడలలో 175 రోజులు ఆడింది. 1997లో టాప్ ఫైవ్ చిత్రాలలో ఒకటిగా నిలిచి, తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకుంది.

Follow Us