Allu Arjun : భావోద్వేగానికి గురైన అల్లు అర్జున్.. కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టిన స్నేహ..
చంచల్‌గూడ జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్ అయ్యారు. ఉదయం ఆరున్నర తర్వాత అల్లు అర్జున్‌ను విడుదల చేశారు జైలు అధికారులు. సెక్యూరిటీ రీజన్స్‌తో మెయిన్ గేట్ నుంచి కాకుండా.. ప్రిజన్స్ అకాడమీ గేట్ నుంచి బయటికి పంపారు. అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకున్న బన్నీకి కుటుంబసభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు.
గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి కాసేపటి క్రితమే ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్. అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని.. చట్టానికి కట్టుబడి ఉంటానని అన్నారు. అలాగే బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలిపారు. సినిమా చేసేందుకు వెళ్లినప్పుడు అనుకోకుండా ఘటన జరిగిందని.. ఉద్దేశపూర్వకంగా జరిగిందని కాదన్నారు. 20 ఏళ్లుగా ఆ థియేటర్ కు వెళ్లి సినిమా చూస్తున్నానని.. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదని అన్నారు. అభిమానం, ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు బన్నీ.
ఇదిలా ఉంటే.. తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ కు ఆయన కుటుంబసభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. ముందుగా ఇంటికి వచ్చిన తన తండ్రిని చూసి పరుగెత్తుకుంటూ వచ్చి హగ్ చేసుకున్నాడు అయాన్. కొడుకును ఎత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు అల్లు అర్జున్. ఆ తర్వాత సతీమణి స్నేహ ఆయనను ఆప్యాయంగా హగ్ చేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు.